Srisailam Reservoir | మహబూబ్‌నగర్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):/కొల్లాపూర్: కండ్ల ముందే నీరున్నా పొలాలకు పారని దుస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులను ఇంకా వెంటాడుతూనే ఉన్నది. కృష్ణా నదిలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతున్నా రేవంత్ సర్కార్ కపట నీతితో అన్నదాత కంటనీరు పెట్టుకోవాల్సిన దుర్గతి పడుతున్నది. జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నా ఏపీకి దోచి పెట్టేందుకే తెలంగాణ రైతుల ఆశలను కాంగ్రెస్ నీరుగారుస్తున్నది. ఒకవైపు కృష్ణా, భీమా నదులు పొంగిపొర్లుతూ శ్రీశైలం వైపు పరుగులు తీస్తుంటే రాష్ట్ర సర్కార్ పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయకుండా దోబూచులాడుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మరో నాలుగు మోటర్లతో కూడా నీటిని ఎత్తిపోయొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండు ప్రాజెక్టులకు నీటిని వదలకుండా కృష్ణా జలాలను వృథాగా దిగువకు వదిలిపెడుతున్నది.
ఆంధ్రా ప్రాజెక్టులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నీటిని తరలిస్తున్నా కృష్ణా రివర్ బోర్డు లెక్కల్లో మాత్రం కనిపించడం లేదు. వేల క్యూసెక్కులు గ్రావిటీ ద్వారా ఆంధ్రా దోచుకుపోతుంటే.. ఏపీ కనుసన్నల్లో ఉన్న బోర్డు ఈ నీటిని లెక్కించడమే లేదు. జూరాల ప్రాజెక్టు ఎగువన కృష్ణా, భీమా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 15 రోజుల నుంచి రోజూ రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు శ్రీశైలానికి చేరుకుంటున్నది. శ్రీశైలం నీటిమట్టం 885 అడుగులకు గాను 874 అడుగులకు చేరి 162 టీఎంసీల మేర నీటినిల్వ చేరింది . ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నది. ఏపీ తన ప్రాజెక్టులకు నీటిని తరలిస్తూ లెక్కలు దాచిపెడుతుండగా, తెలంగాణ సర్కార్ మాత్రం ఉన్న రెండు ప్రాజెక్టులకు నీళ్లను తరలించలేక చేతులెత్తేస్తున్నది.
బీఆర్ఎస్ ఒత్తిళ్లతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇటీవలే రాష్ట్ర సర్కార్ నాలుగు పంపులను సిద్ధం చేసింది. డ్రైరన్‌తో పాటు వెటరన్ నిర్వహించి, నీటిని నాగలాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పంపులను ప్రారంభించకుండా ప్రభుత్వం దోబూచులాడుతున్నది. గుడిపల్లి రిజర్వాయర్‌లో నీటిని నింపేందుకు ససేమిరా అన్న రాష్ట్ర సర్కార్.. ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో ఎట్టకేలకు ఆ రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లిస్తున్నది. జూరాల బేసిన్లో ఉన్న భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ కుడి, ఎడమ కాలువలతోపాటు ప్యారలల్ కెనాల్‌కు అరకొరగా నీటిని మళ్లిస్తున్నారు. గోదావరి జలాలను చంద్రబాబు మెప్పు కోసమే దిగువకు తరలించిన రేవంత్ సర్కార్.. కృష్ణా నీటిని ఎత్తిపోయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 11వరకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలోని పంపులన్నీ ఆన్‌చేసి నార్లాపూర్ రిజర్వాయర్ నింపకుంటే కేటీఆర్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమవుతామని పార్టీ నేతలు అల్టిమేటం జారీచేశారు.
ఎగువన వస్తున్న కృష్ణా జలాలు కల్వకుర్తి లిఫ్ట్ పంపులకు అందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మోటర్లను ఆన్ చేయకుండా తాత్సారం చేస్తున్నది. ఈ ఎత్తిపోతల పథకం కింద ఎల్లూరు, జొన్నల బొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ మూడు రిజర్వాయర్లను నింపుకొంటే తాగు, సాగునీటికి ఇబ్బందులే ఉండవు. అంతేగాకుండా సీఎం సొంత గ్రామానికి, ఆయన పుట్టి పెరిగిన నియోజకవర్గానికీ ఈ పథకమే శరణ్యం. చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా.. ఆశించిన స్థాయిలో నీటిని విడుదల చేయడం లేదు. ఈ ఎత్తిపోతల కింద ఉన్న నార్లాపూర్, జొన్నలప్పగూడ రిజర్వాయర్లలో నీటిని నింపి వదిలేశారు. గుడిపల్లి రిజర్వాయర్‌లో నీటిని విడుదల చేయకుండా అడ్డుకట్టలు వేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం మేర పనులు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేస్తే కేసీఆర్‌కే పేరొస్తుందని కాంగ్రెస్ సర్కార్ మూడేండ్లుగా పడావు పెట్టింది. చివరకు బీఆర్ఎస్ నేతల అల్టిమేటంతోపాటు రైతుల ఆందోళన నేపథ్యంలో నార్లాపూర్ పంప్‌హౌస్‌లో మోటర్లను టెస్ట్ డ్రైవ్ చేశారు. నాలుగు మోటర్లలో రెండింటిని వెటరన్ నిర్వహించి మరో రెండింటితో డ్రైరెన్ కూడా పూర్తిచేశారు. ఈ ఎత్తిపోతలలో రెండు మోటర్లు సిద్ధంగా ఉన్నా, మరో రెండు మోటర్లు నీటిని ఎత్తిపోయడానికి అవకాశం ఉన్నా సర్కార్ మాత్రం సైలెంట్‌గానే ఉంటున్నది. జూరాల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదికి గత 15 రోజుల నుంచి రోజూ సుమారు 2.50 లక్షల క్యూసెక్కుల నీటిని సర్కార్ జారవిడిచింది. శుక్రవారం వరకు 2.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో శ్రీశైలానికి వచ్చి చేరింది. ఆ నీరు మొత్తం పాలమూరు హెడ్ రెగ్యులేటరీకి చొచ్చుకువస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పంపులను ఆన్‌చేస్తే నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఇప్పటికే ఉన్న జలాలతోపాటు మరో నాలుగు నుంచి ఐదు టీఎంసీల నీటి వరకు నిలువ చేసే అవకాశం ఉన్నది. ఒకవేళ వరద తగ్గినా ఈ నార్లాపూర్ లింక్ కెనాల్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు సాగునీటిని విడుదల చేయొచ్చని ఇంజినీర్లే అంటున్నారు.
కృష్ణా, భీమా బేసిన్లో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉప్పొంగి పారుతున్నది. జూరాల ప్రాజెక్టును ముంచెత్తుతున్నది. ప్రస్తుతం జూరాలకు 2.25 లక్షల ఇన్‌ఫ్లో నమోదు కాగా, అదే స్థాయిలో అవుట్ ఫ్లో నమోదవుతున్నది. ఈ జలాలన్నీ నేరుగా శ్రీశైలానికే చేరుతున్నాయి. కానీ, జూరాల నుంచి 2.25 లక్షల నీటిని వదిలితే రెండు లక్షల 12,365 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తున్నదని కృష్ణా రివర్ బోర్డు మాత్రం లెక్కలు చెప్తున్నది. కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాలకు నీటిని విడుదల చేస్తున్నట్టు చెప్తున్నది. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం జూరాల నుంచి వస్తున్న వరదనీటిని ఏపీ ప్రభుత్వం దొంగచాటుగా తరలిస్తున్నది అనేది బహిరంగ రహస్యం. ఇప్పటికే కేసీ కెనాల్, హంద్రీనీవా సుజల స్రవంతితో పాటు పోతిరెడ్డిపాడు స్టేజ్-1, స్టేజ్-2కు భారీ ఎత్తున నీటిని తరలించుకుపోతున్నది. జూరాల నుంచి వస్తున్న అవుట్ ఫ్లో లెక్కిస్తే ఇప్పటికే శ్రీశైలంలో 170 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉండేది. కానీ 162 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్టు శ్రీశైలం రికార్డులు చెప్తున్నాయి. 885 అడుగుల గరిష్ఠ నీటిమట్టానికి ప్రస్తుతం శ్రీశైలంలో 874 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, 185 టీఎంసీలకు గాను 162 టీఎంసీలు మాత్రమే వచ్చి చేరిందని తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం దొంగచాటుగా కృష్ణాజలాలను తరలించుకు పోతుందనడానికి ఈ లెక్కలే ఆధారం. ప్రభుత్వం మేల్కొని పాలమూరు , కల్వకుర్తి ఎత్తిపోతల పంపులను పూర్తిస్థాయిలో ఆన్‌చేసి ఆ నీటిని వాటి పరిధిలోని రిజర్వాయర్లలో నిలువ చేసుకొంటే సాగు, తాగునీటికి ఇబ్బందులు తీరుతాయని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు కోరుతున్నారు.
పాలమూరు ప్రాజెక్టులపై కాంగ్రెస్ కపటనీతిపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టేందుకే రాష్ట్ర సర్కార్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నీళ్లివ్వకుండా తాత్సారం చేస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోపాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటర్లు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం ఎందుకు నీటిని ఎత్తిపోయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 11 వరకు ప్రభుత్వం ఆ రెండు ఎత్తిపోతల పథకాల పంపులను ప్రారంభించి నీటిని లిఫ్ట్ చేయకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. దీంతో ఉమ్మడి జి ల్లా కృష్ణాజలాల పోరుపై రాజకీయ వేడి రగులుకున్నది. ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులకు నీళ్లు అందిస్తుందా? చంద్రబాబు కనుసన్నల్లో పాలమూరుకు అన్యా యం చేస్తుందా? అనేది తేలనున్నది.