హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్న చేనేత కళాకారుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సెల్యూట్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా నేతన్నలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నలు బతికితేనే చేనేత కళ బతుకుతుందని, చేనేత రంగం అభివృద్ధికి, సంక్షేమానికి ప్రతి ఒకరూ అండగా నిలువాలని పిలుపునిచ్చారు.
గతంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగానికి అండగా నిలిచిందని గుర్తుచేశారు. నేతన్నలకు చేయూత, నూలు సబ్సిడీ, బతుకమ్మ చీరలు, వరర్ టు ఓనర్ వంటి విప్లవాత్మక పథకాలను అమలు చేసి చేనేత రంగానికి కేసీఆర్ ఊపిరి పోశారని కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల జీవితాలు సంక్షోభంలోకి వెళ్లాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉపాధి కరువై అప్పుల బాధలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన చెందారు. జాతికి బట్ట నేసి ఇచ్చే చేతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నదని స్పష్టంచేశారు. చేనేత రంగాన్ని ఆదుకోవాలని, కార్మికులకు భరోసా కల్పించి చేనేతకు పూర్వవైభవం తేవాలని డిమాండ్ చేశారు.