హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తేతెలంగాణ): ‘జూరాల, కేఎల్ఐ పంపులు ఆన్‌చేసి కృష్ణా పరిధిలోని ప్రాజెక్టుల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలి. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట పడుతాం. ఈ నెల 11న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో నార్లాపూర్‌కు లక్షలాది మంది రైతులతో కదులుతాం. అక్కడే కార్యాచరణ ప్రకటించి కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరిపిస్తాం’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. పాలమూరు రైతాంగానికి ద్రోహం చేస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో శుక్రవారం బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జూరాల, కల్వకుర్తి పరిధిలోని పంపులు, భీమా ఫేస్ 1, 2, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ లిఫ్టులు, జూరాల కాలువలను తక్షణమే ప్రారంభించి సుమారు 8 నియోజకవర్గాల్లోని 500 చెరువులను నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి నుంచి మరో 200 రోజులు పంపులు నడుపుకొనే అవకాశాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని నిలదీశారు.
‘802 మీటర్ల వద్ద కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా నీళ్లు ఎత్తిపోయవచ్చని, ఇప్పుడు 854 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు పోతున్నా ఎందుకు ఎత్తిపోయడంలేదు? గురుదక్షిణ కింద ఏపీకి నీటిని వదిలేందుకేనా? ఏపీ సీఎం బాబు తాబేదారు.. మన నీటిపారుదల సలహాదారు ఆదిత్యానాథ్ దాస్ అనుమతి కోసం వేచిచూస్తున్నారా?’ అంటూ మండిపడ్డారు. ‘కృష్ణా నదికి ఆశాజనకమైన నీటి ప్రవాహం ఉన్నది. జూరాల నుంచి 2.30 లక్షల క్యూసెక్కులు శ్రీశైలానికి వెళ్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 160 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ ప్రవాహం కొనసాగితే వారంలో నిండుతుంది. అయినా కృష్ణాలో ప్రవాహమే లేదని నాగార్జునసాగర్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి వరుణయాగం తలపెట్టడం సిగ్గుచేటు’ అని విరుచుకుపడ్డారు. నీటి ఎత్తిపోతలపై 15 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడం సరికాదన్నారు.
పాలమూరు బిడ్డ.. అల్లుడితో రైతులకు శాపం
పాలమూరు బిడ్డ సీఎం రేవంత్‌రెడ్డి, అల్లుడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి జిల్లాకు శనిలా దాపురించారని నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వీరిద్దరి తీరు జిల్లా రైతాంగానికి శాపంగా మారిందని తూర్పార బట్టారు. పాలమూరు బిడ్డనైనా తనకు గొప్ప అవకాశం వచ్చిందని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం తప్ప.. ఉద్ధరించిందేమీలేదని ధ్వజమెత్తారు. గద్దెనెక్కి రెండున్నరేండ్లు దాటినా పాల మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. సాగుకు నీరందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. పాలమూరుకు నీళ్లు ఎత్తిపోయొద్దు అని మంత్రి ఉత్తమ్‌కుమార్ ఆదేశాలివ్వడం దారుణమని దుయ్యబట్టారు. ‘సీఎం రేవంత్‌రెడ్డిపై కోపంతో ఉత్తమ్‌కుమారెడ్డి ఇలా చేస్తున్నారా? చంద్రబాబుకు సహకరిస్తున్నారా? నాగార్జున సాగర్ నిండాలని భావిస్తున్నారా? అదే నిజమైతే మధ్యలో ఏపీ తరలించుకుపోదా?’ అంటూ సూటిగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. తాగునీటి పేరిట రైతాంగాన్ని మభ్యపెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. తాగునీటి కోసం 9 టీఎంసీలు సరిపోతాయని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి తన గురువుకు మేలు చేసేందుకే రైతాంగాన్ని ముంచుతున్నారని ఆరోపించారు.
అనుమతులొచ్చినా ఆదిత్యానాథ్ దాస్ మెలిక
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చినా పనులు కొనసాగించకుండా ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులంటూ సాగునీటి సలహాదారు ఆదిత్యానాథ్ దాస్ మెలికపెట్టారని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే చట్టపరమైన చిక్కులు వచ్చేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలంలో 160 టీఎంసీల నీళ్లుంటే 45 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయని ఏవిధంగా నివేదిక ఇచ్చారని నిలదీశారు. నీళ్ల మంత్రి చుట్టూ ఆంధ్రా అధికారులు చేరి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కృష్ణా ప్రాజెక్టుల నుంచి అతితక్కువగా సాగునీరు ఎత్తిపోసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. నీళ్లులేవని పిరికిమాటలు చెబుతూ అన్నదాతలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆల్మట్టి ఎత్తును ఎందుకు అడ్డుకోరు?
కర్ణాటక ప్రభుత్వం 129 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచి మరో 100 టీఎంసీలు నింపుకొనేందుకు చర్యలు చేపట్టిందని, ఆ ప్రయత్నాలను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే జూరాలకు చుక్కనీరు రాదని.. పాలమూరు జిల్లా ఏడారిగా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నదని విస్మరిస్తున్నారా? అని నిలదీశారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని కర్ణాటక ప్రాజెక్టులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ రైతుల చేతిలో ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు.