Tammy Beaumount : ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినా.. ఫీల్డింగ్‌కు అంతరాయం కలిగించినా క్రికెటర్లకు భారీగా ఫైన్ వేస్తారు. అలానే స్లో ఓవర్ రేటు నమోదైతే సదరు కెప్టెన్ మ్యాచ్ ఫీజులో కోత పడుతుంది. కానీ, కొన్నిసార్లు ఐసీసీ అంపైరింగ్ ప్యానెల్‌లోని అంపైర్ల పొరపాట్లు మ్యాచ్ ఫలితాన్నే నిర్ణయిస్తాయి. ఒక జట్టుకు లాభం చేకూరిస్తే.. మరొక జట్టుకు నష్టం కలిగిస్తాయి. లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో టమ్మీ బ్యూమంట్ (Tammy Beaumount) అలానే బతికిపోయింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫీల్డింగ్‌కు అంతరాయం కలిగించింది. అయినా సరే అంపైర్ అమెను నాటౌట్‌గానే ప్రకటించారు. దాంతో, హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఇదెక్కడి రూల్? అని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. లార్డ్స్ మైదానంలో శనివారం జరిగిన రెండో వన్డేలో టమ్మీ బ్యూమంట్ దీప్తి శర్మ బౌలింగద్లో సింగిల్ కోసం ప్రయత్నించింది. మిడ్ వికెట్లో కాచుకొని ఉన్న జెమీమా రోడ్రిగ్స్ బంతిని అడ్డుకొని వేగంగా వికెట్ కీపర్ రీచా ఘోష్ వైపు విసిరింది.
Boos ring out at Lord’s as Tammy Beaumont survives a strange obstructing-the-field appeal, even as Richa Ghosh looks far from pleased. #ENGvIND pic.twitter.com/Mq1Slhg7oz
— Aditya Chaturvedi (@aditya_c19) July 19, 2025
అయితే.. ఆమెను గమనించిన టమ్మీ వెనక్కి వచ్చే క్రమంలో క్రీజు మధ్యలోంచి పరుగెత్తింది. బంతి ఆమె కాలికి తగిలింది. అందుకే భారత జట్టు మొత్తం ఫీల్డింగ్‌కు అంతరాయం కలిగించిందని, అమెను ఔట్‌గా ప్రకటించాలని అప్పీల్ చేసింది. కానీ ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. థర్డ్ అంపైర్ కూడా నాటౌట్ అని చెప్పడంతో హర్మన్‌ప్రీత్ బృందం నిరాశకు గురైంది. ఎంసీసీ నియమావళిలోని 37.1 చట్టం ప్రకారం బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్‌కు అంతరాయం కలిగిస్తే వాళ్లను ఔట్ ఇవ్వాలి.
వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన రెండో వన్డేలో భారత జట్టు 143 పరుగులకే పరిమితమైంది. స్మృతి మంధానా(42), దీప్తి శర్మ (30)లు పోరాడడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. అనంతరం స్వల్ప ఛేదనను ఇంగ్లండ్ ఓపెనర్లు ధాటిగా మొదలెట్టారు. టమ్మీ బ్యూమంట్ (34), అమీ జోన్స్(46 నాటౌట్) లు బౌండరీలతో చెలరేగి శుభారంభమిచ్చారు. వీరిద్దరి మెరుపులతో లక్ష్యం కరుగుతూ వచ్చింది.
అయితే.. మధ్యలో వర్షం మళ్లీ అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ (DLS) ప్రకారం ఇంగ్లండ్ టార్గెట్‌ను 24 ఓవర్లలో 115 పరుగులకు సవరించారు. జోన్స్, బ్యూమంట్తో పాటు కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(21) రాణించడంతో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ సిరీస్‌ను సమం చేసింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డే జూలై 22న జరుగనుంది.