Old Trafford : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో అనూహ్య ఓటమితో సిరీస్‌లో వెనకబడింది భారత జట్టు. లార్డ్స్‌లో గెలుపువాకిట నిలిచి చివరకు ఇంగ్లండ్‌కు మ్యాచ్‌ను అప్పగించిన శుభ్‌మన్ గిల్ సేన.. మాంచెస్టర్‌లో విజయంపై గురి పెట్టింది. ఓల్డ్ ట్రఫోర్డ్ (Old Trafford) మైదానంలో బుధవారం నుంచి జరుగబోయే నాలుగో టెస్టు కోసం నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు టీమిండియా స్టార్లు. అయితే.. ఈ మైదానంలో భారత ఆటగాళ్ల రికార్డు ఏమంత ఘనంగా లేదు.
ఈ వేదికపై ఒక ఇండియన్ సెంచరీ బాది దాదాపు 35 ఏళ్లు అవుతోంది. అవును.. ఇక్కడ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) 1990లో వంద కొట్టాడు. ఆ తర్వాత ధోనీ, గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇలా స్టార్ ఆటగాళ్లు ఎందరో వచ్చినా ఒక్కరు కూడా ఓల్డ్ ట్రఫోర్డ్‌లో మూడంకెల్ స్కోర్ చేరుకోలేకపోయారు.
Only 8 Indian batters have scored a Test ton at Old Trafford, Manchester! 🇮🇳🏟️🤍
Sachin Tendulkar was the last — at just 17 years of age in 1990! 👏💯#SachinTendulkar #India #ENGvIND #Tests #Sportskeeda pic.twitter.com/FqQIqnJ3Xa
— Sportskeeda (@Sportskeeda) July 19, 2025
ఓల్ట్ ట్రఫోర్డు మైదానంలో భారత సెంచరీ వీరులు ఎనిమిది మంది మాత్రమే. వీళ్లలో ముస్తాక్ అలీ తొలి సెంచూరియన్‌గా రికార్డు నెలకొల్పాడు. అలీ 1936లో శతక గర్జన చేశాడు. అదే ఏడాది విజయ్ మర్చంట్ కూడా ఈ వేదికపై వందతో చెలరేగాడు. అనంతరం1959లో పాలీ ఉమ్రిగర్, అబ్బాస్ అలీ బైగుల్ ఆతిథ్య జట్టు బౌలర్లను చితక్కొడుతూ సెంచరీ సాధించారు. సునీల్ గవాస్కర్ 1974లో, సందీప్ పాటిల్(1982లో)లు శతకాలతో రెచ్చిపోగా 1990 పర్యటనలో మహ్మద్ అజారుద్దీన్, సచిన్ మూడంకెల స్కోర్ విజృంభించారు.
సచిన్, సందీప్ పాటిల్, గవాస్కర్
కొత్త సారథి శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇంగ్లండ్ పర్యటన సవాల్ విసురుతోంది. తొలి టెస్టులో పరాజయం తర్వాత సంచలన ఆటతో స్టోక్స్ బృందానికి చెక్ పెట్టింది టీమిండియా. అదే జోరును లార్డ్స్‌లోనూ చూపించినా.. 193 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక చతికిలపడింది. ప్రధాన బ్యాటర్లు విఫలమవ్వగా.. టెయిలెండర్లతో కలిసి రవీంద్ర జడేజా (62నాటౌట్) చేసిన ఒంటరి పోరాటమంతా వృథా అయ్యింది. 2-1తో సిరీస్‌లో వెనకబడిన గిల్ సేన ఓల్ట ట్రఫోర్డులో సమిష్టిగా రాణించి సిరీస్ సమం చేయాలనుకుంటోంది.