MLA Chinthakunta Vijaya Ramana Rao | సుల్తానాబాద్ రూరల్ జులై 20: అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని, ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మండలంలోని గర్రెపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ముగ్గురు పోసి మంజూరు పత్రాలను అందజేశారు. గ్రామంలో పలు సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ గర్రెపల్లి గ్రామంలో దాదాపు రూ. 85 లక్షల వరకు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. రహదారి నుంచి గర్రెపల్లి చివరి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాజీ సింగిల్ విండో చైర్మన్ కల్లపల్లి జానీ చెరువుకట్టపై ఎల్ఈడీ లైట్స్, మరో వంద ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని, మరికొన్ని సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ లు రాత్రి వేళలో గర్రెపల్లి వద్ద ఆపడం లేదని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఎక్స్ప్రెస్ రాత్రి వేళల్లో ఆగే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, వైస్ చైర్మన్ గణేష్, ఎంపీవో సమ్మిరెడ్డి , పంచాయతీ కార్యదర్శి లచ్చయ్య, కాంగ్రెస్ నాయకులు సతీష్, దామోదర్ రావు, పన్నాల రాములు, సత్యనారాయణ రావు, వెంకటేశం, బండారి రమేష్, వెంకన్న, చక్రధర్ తో పాటు తదితరులున్నారు. అలాగే పంచాయతీల ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ చైర్మన్ గా ఎన్నికైన జొన్నకోటి వెంకటేష్ ను ప్రకాష్ రావు, జానీ సన్మానం చేశారు.