బెంగళూరు: రాజ్యసభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ‘ఆపరేషన్ లోటస్’కు బీజేపీ ప్రయత్నించిందని డిప్యూటీ సీఎం శివకుమార్ విమర్శించారు. ఇక్కడకు తరలించిన ఒడిశా ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు చొప్పున ఆఫర్ చేసినట్లు ఆరోపించారు. క్రాస్ ఓటింగ్ కోసం లంచం ఇవ్వజూపిన వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. (BJP’s Op Lotus) మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఒడిశాలోని అధికార బీజేపీ ప్రలోభాల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సీనియర్ నేతలను బెంగళూరులోని రిసార్ట్‌కు తరలించారు.
కాగా, ఒడిశా బీజేపీకి చెందిన నలుగురు వ్యక్తులు ఆదివారం ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో సంప్రదించినట్లు డిప్యూటీ సీఎం శివకుమార్ ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కోసం ఒక్కొక్కరికి రూ.5 కోట్ల చోప్పున వారు ఆఫర్ చేసినట్లు ఒడిశా ఎమ్మెల్యేలు చెప్పారన్నారు. ‘కర్ణాటకలో బీజేపీ స్నేహితులు నిర్వహించిన గొప్ప ‘ఆపరేషన్ లోటస్’ ఇది. వారు ఖాళీ చెక్కును అందించడం ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేతో చర్చలు జరుపడానికి ప్రయత్నించారు’ అని అన్నారు. నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు అరెస్టైనట్లు వివరించారు.
మరోవైపు ఒడిశా కాంగ్రెస్ శాసనసభ పక్ష ఉప నాయకుడు అశోక్ కుమార్ దాస్, బిడది పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యేలను నలుగురు వ్యక్తులు సంప్రదించారని, రాజ్యసభ ఎన్నికల్లో ఒక బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటు వేయడానికి వారికి డబ్బు ఆశ చూపారని ఆరోపించారు.
అయితే తమ ఎమ్మెల్యేలు ఈ ఆఫర్‌ను తిరస్కరించినప్పుడు, వారు ఒడిశాకు తిరిగి వస్తే చంపేస్తామని ఆ వ్యక్తులు బెదిరించినట్లు అశోక్ కుమార్ దాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులను ఒడిశాకు చెందిన బిరేంద్ర ప్రసాద్, సురేష్, అజిత్ కుమార్ సాహు, సిమాచల్ మోహకుడ్గా ఆయన గుర్తించారు.
కాగా, ఈ ఆరోపణలను ఒడిశా బీజేపీ ఖండించింది. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓటమి ఖాయమని గ్రహించిన తర్వాతే కాంగ్రెస్ నేతలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఒడిశా బీజేపీ ప్రతినిధి అనిల్ బిస్వాల్ మీడియాతో అన్నారు. క్రాస్-ఓటింగ్‌కు పాల్పడటం కాంగ్రెస్‌కు అలవాటని ఆయన విమర్శించారు.
Also Read:
Hostel Woman Harassed | హాస్టల్లో కేరళ మహిళకు వేధింపులు.. ఒక వ్యక్తి అరెస్ట్
Family Kills Daughter, Her Lover | ప్రేమించుకోవడంపై అభ్యంతరం.. జంటను హత్య చేసిన యువతి కుటుంబం