Arvind Kejriwal : ఈ20 పెట్రోల్ బలవంతపు వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీ ఇంటికి మార్చ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా రెండు లక్షల మంది సంతకాలతో కూడిని పిటిషన్‌ను మోదీకి ఇవ్వాలని కేజ్రీవాల్ భావించారు. దాదాపు 100 మందితో కలిసి మోదీ నివాసానికి కేజ్రీవాల్ బయల్దేరారు. మోదీ ఇంటికి వెళ్తున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. తనను పోలీసులు అడ్డుకోవడంపై కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను ప్రభుత్వం అడ్డుకోవడానికి చూపించే తెగువ ఏదో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై చూపించాలని మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఈ20 పెట్రోల్ వినియోగాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ20 పెట్రోల్ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆన్లైన్లో పిటిషన్ దాఖలు చేయగా, దానికి రెండు లక్షల మంది తమ సంతకాలతో మద్దతు తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాల్ని కేజ్రీవాల్.. మోదీకి అందించాలనుకున్నారు. అయితే, ఆయన మోదీ నివాసానికి నడిచి వెళ్తుండగా ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. ‘‘ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా రెండు లక్షల మంది మద్దతు ఇచ్చిన పిటిషన్లను ప్రధాని మోదీకి ఇచ్చేందుకు ప్రయత్నించాం. ఈరోజు మేం మోదీని కలిసేందుకు వెళ్తుంటే పోలీసులు ఆపేశారు. కానీ, అన్ని పిటిషన్లను మేం మోదీకి అందించాం. మోదీజీ, మిమ్మల్ని కలిసేందుకు వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు.
మీ అధికారాన్ని మాపై ఉపయోగించడం వల్ల మీరు ఏం సాధించగలరు..? ఈ తెగువ ఏదో ట్రంప్ ముందు చూపించండి. ఇండియాపై బలవంతంగా ఈ20 పెట్రోల్ రుద్దడాన్ని ఆపండి. లేదంటే దేశంలో మరో భారీ ఉద్యమం మొదలవుతుంది’’ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అంతకుముందు తనను అడ్డుకున్న పోలీసులతో కేజ్రీవాల్ వాగ్వాదానికి దిగారు. తామేమీ టెర్రరిస్టులం కాదని, ఈ20 పెట్రోల్ సమస్యపై ప్రధానిని కలిసేందుకు మాత్రమే వెళ్తున్నామని, దయచేసి ఆయనను కలిసే అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ, దీనికి పోలీసులు అంగీకరించలేదు. దీంతో ఆయన వెనుదిరిగారు.