కరకగూడెం, ఆగస్టు 04 : ఆర్ఎంపీలు తమ పరిధికి మించి వైద్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డా.తుకారం రాథోడ్ హెచ్చరించారు. మంగళవారం కరకగూడెం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆశా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆస్పత్రిలో కలియతిరుగుతూ రక్త పరీక్షల ల్యాబ్‌ను, మందుల గదిని, రోగుల గదులను, ప్రసవాల గదిని, రికార్డులను క్షణ్ణంగా పరిశీలించారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేసి అనంతరం మాట్లాడారు. వర్షాలు అధికంగా కురుస్తున్న తరుణంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అశా కార్యక్తలు తమ పరిధిలో గల గ్రామాలలో యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రతి ఇంటిని సందర్శించి జ్వరంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు చేయాలని సూచించారు.
గర్భీణీలకు సకాలంలో పరీక్షలు చేసి రక్తహీనత నుండి కాపాడాలన్నారు. గ్రామాల్లో మూఢ నమ్మకాలను తొలిగించుటకు కృషి చేయాలన్నారు. సీరియస్ కేసులు ఉంటే సిబ్బంది వెంటనే డాక్టర్ కు తెలియజేయాలని వివరించారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు స్థాయికి మించి వైద్యం అందిస్తే శాఖ పరమైన చర్యలతో పాటు క్లినిక్‌లను సీజ్ చేస్తామని మాట్లాడిన ఆయన వాటి నిర్వహణ విధానాల గురించి పీహెచ్సీ వైద్యాధికారి రవితేజను ఆరా తీశారు. వైద్య సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రతాప్, వైద్య, ఆరోగ్య సిబ్బంది నాగభూషణం, రాంప్రసాద్, హెచ్ఐఓ కృష్ణయ్య పాల్గొన్నారు.

ఆర్ఎంపీలు పరిధి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్ఓ డా.తుకారం రాథోడ్