KA Paul : ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల (Wars) కారణంగా నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలు (Fuel prices) నియంత్రణ లేకుండా పెరిగిపోతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (Prajashanti Party chief) కేఏ పాల్ (KA Paul) తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన 58 యుద్ధాల ప్రభావం దాదాపు 200 దేశాలలోని 850 కోట్ల మందిపై తీవ్రంగా పడిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి ప్రారంభమై ఆరు నెలలుగా కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ (US-Iran) సైనిక ఉద్రిక్తతలవల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతిని, సామాన్యుడికి నిత్యావసరాలు అందని ద్రాక్షగా మారాయని అన్నారు.
మార్కెట్లో రూ.100 ఉండే వస్తువుల ధరలు రూ.200 నుంచి రూ.300 వరకు పెరిగాయని, లీటర్ పెట్రోల్, గ్యాస్ ధరలు రెండు డాలర్ల నుంచి ఏకంగా 4, 5 డాలర్లకు చేరాయని కేఏ పాల్ లెక్కలతో వివరించారు. ధనిక వర్గాలకు ఈ ధరల పెరుగుదలవల్ల పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ.. సమాజంలో ఉన్న 90 శాతం పేద, మధ్యతరగతి ప్రజలు ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్నారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొంటేనే ధరల నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు.
ప్రపంచ శాంతి సాధన కోసం రాబోయే సెప్టెంబర్ 28న వాషింగ్టన్ డీసీలోని టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రత్యేక ప్రశాంతతా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు.