South Africa Cricket : స్వదేశంలో జరుగుతున్న పొట్టి సిరీస్‌లో టీమిండియా చేతిలో రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా(South Africa)కు మరో షాక్. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2023-25) ఫైనల్‌పై ఆ జట్టు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. అవును.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు కీలకమైన టెస్టు సిరీస్‌కు స్టార్ పేసర్ లుంగి ఎంగిడి (Lungi Ngidi) దూరం కానున్నాడు.
గజ్జల్లో చిన్నపాటి గాయం కారణంగా ఈ స్పీడ్‌స్టర్ శ్రీలంకతో జరుగబోయే రెండు టెస్టులకు అందుబాటులో ఉండడం లేదు. సఫారీల పేస్ బౌలింగ్ యూనిట్లో అనుభవజ్ఞుడైన ఎంగిడి లేకపోవడం ఆ జట్టు విజయావకాశాల్ని దెబ్బ తీసే అవకాశముంది.
PLAYER UPDATE 🗞
Proteas Men’s fast bowler Lungi Ngidi has been ruled out of the upcoming Test series against Sri Lanka, as well as the all-format tour against Pakistan, due to a groin injury.
The 28-year-old recently underwent a medical assessment as part of his structured… pic.twitter.com/aZVL64aX9X
— Proteas Men (@ProteasMenCSA) November 14, 2024
‘శ్రీలంకతో జరుగబోయే టెస్టు సిరీస్‌కు దక్షిణాఫ్రికా పురుషుల జట్టు ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి దూరమయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా అతడు ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. అంతేకాదు పాకిస్థాన్ పర్యటనకు కూడా ఎంగిడి అందుబాటులో ఉండడం లేదు. ప్రస్తుతం అతడు పునరావాస కేంద్రంలో కోలుకోనున్నాడు. అయితే.. వచ్చే ఏడాది జవనరి కల్లా ఎంగిడి ఫిట్‌గా మారి మైదానంలోకి దిగే వీలుంది’ అని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
సుదీర్ఘ ఫార్మాట్లో సఫారీ జట్టును గాయాలు వేధిస్తున్నాయి. సారథి తెంబా బవుమా (Temba Bavuma) గాయంతో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లలేదు. అయినా సరే.. ఎడెన్ మర్క్రమ్ నేతృత్వంలో సఫారీ జట్టు ఆతిథ్య బంగ్లాను క్వీన్‌స్వీప్ చేసి డబ్ల్యూటీసీ పట్టికలో ఐదో స్థానం సాధించింది. ఇక.. శ్రీలంకపై కూడా గెలిస్తే ఫైనల్ ఆడే అవకాశాలు మెరుగుపడుతాయి.
ఈ నేపథ్యంలో లుంగి ఎంగిడి గాయంతో లంక సిరీస్‌కు దూరమవ్వడం దక్షిణాఫ్రికాకు మింగుడుపడనిదే. ఇక మోచేతి గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ బవుమాకు సోమవారం నవంబర్ 18న ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్ 27వ తేదీన శ్రీలంక, దక్షిణాఫ్రికాల మధ్య తొలి టెస్టు జరుగనుంది.