లక్నో: ఒక డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. బాలుడి ఎడమ కంటికి బదులు తప్పుగా కుడి కంటికి ఆపరేషన్ చేశాడు. (Doctor Operates On Wrong Eye) ఇది గ్రహించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని, ఆ హాస్పిటల్‌ను మూసివేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఏడేళ్ల బాలుడి ఎడమ కంటి నుంచి తరచుగా నీరు కారుతోంది. దీంతో ప్రైవేట్ కంటి ఆసుపత్రికి ఆ బాలుడ్ని తీసుకెళ్లారు. కంటి వైద్యుడు ఆనంద్ వర్మ పరీక్షించాడు. ఆ బాలుడి ఎడమ కంటిలో ప్లాస్టిక్ లాంటి వస్తువు ఉందని తెలిపాడు. ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చని చెప్పాడు. కంటి ఆపరేషన్‌కు రూ. 45,000 ఖర్చవుతుందని అన్నాడు.
కాగా, నవంబర్ 12న ఆ బాలుడి కంటికి ఆపరేషన్ చేశారు. ఇంటికి చేరుకోగానే ఎడమ కంటికి బదులు తప్పుగా కుడి కంటికి ఆపరేషన్ చేసినట్లు బాలుడి తల్లి గ్రహించింది. దీంతో కంటి డాక్టర్ నిర్లక్ష్యంపై పేరెంట్స్ మండిపడ్డారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని, ఆసుపత్రికి సీల్ వేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.