Russia : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాపై నీలిమేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇండియా సహా అనేక దేశాలకు చమురు సరఫరా ఆగిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇండియాకు తగినంత చమురు సరఫరా చేసేందుకు రష్యా సిద్ధమైంది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం వల్ల హోర్ముజ్ జలసంధిలో రవాణా నిలిచిపోయింది. ముఖ్యంగా చమురు రవాణా ఆగిపోయింది. చమురు నౌకలు కదిలే పరిస్తితి లేదు. ఇండియాకు 40 శాతం చమురు ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే వస్తుంది.
అలాంటిది ఈ సంధి మార్గంలో చమురు రవాణా ఆగిపోతే ఇండియా తీవ్ర చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇండియా దగ్గర 25 రోజులకు సరిపడా మాత్రమే ఆయిల్ నిల్వలు ఉన్నాయని సమాచారం. ఆ తర్వాత చమురు వాడుకోవాలంటే కొత్తగా ఆయిల్ రావాల్సిందే. అందుకే మన దేశంలో ఆయిల్ సంక్షోభం తలెత్తకుండా రష్యా ముందుకొచ్చింది. ఇండియాకు రష్యా 9.6 మిలియన్ల బ్యారెళ్ల క్రూడాయిల్‌ను అందించనుంది. ఈ మేరకు రష్యా చమురు నౌకలు ఇండియాకు బయల్దేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత సముద్ర జలాల్లోనే ఈ నౌకలుండగా, మరికొద్ది రోజుల్లోనే ఈ నౌకలు ఇండియాకు చేరుకోనున్నాయి. అయితే, రష్యా నౌక ఎక్కడ ఉందనే సమాచారం మాత్రం తెలియదు. రష్యా గతంలో మనకు తక్కువ ధరకే చమురు అందించేది. కానీ, ప్రస్తుతం మార్కెట్ ధరకే చమురు అందించేందుకు సిద్ధమైంది.
అలాగే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కూడా అందిస్తామని రష్యా ప్రకటించింది. ఇటీవల అమెరికా ఆంక్షలు, వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోళ్లు తగ్గించినట్లు సమాచారం. గత జనవరిలో రష్యా నుంచి ఇండియా 1.1 మిలియన్ల బ్యారెళ్ల చమురు మాత్రమే దిగుమతి చేసుకుంది. ఇది నవంబర్ 2022 నుంచి అత్యల్పం. మిడిల్ ఈస్ట్‌లో మరో రెండు వారాలు యుద్ధం కొనసాగినా ఆయిల్‌పై ప్రభావం పడకుండా ఇండియా ప్రయత్నిస్తోంది. ఇండియన్ గ్యాస్ కంపెనీలు ప్రతి రోజూ 5.6 మిలియన్ బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తాయి. అయితే, ఇప్పుడు తగినంత ఆయిల్ సరఫరా కావడం లేదు. ఇక.. ఇండియా.. ప్రపంచంలోనే మూడో చమురు వినియోగ దేశం. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో భారతీయ కంపెనీలు పలు పరిశ్రమలకు చమురు సరఫరాను తగ్గించాయి.