‘ఈ సినిమాకోసం నాకిష్టమైన కొరియా వెళ్లాను. అలాగే అనంతపురం, కజకిస్థాన్‌లలో కూడా షూట్ చేశాం. ఈ షూటింగ్ జర్నీ అందమైన అనుభూతినిచ్చింది. ఇందులో నేను చేసిన పాత్ర నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుంది. ఇది కేవలం కమర్షియల్ పాత్ర మాత్రమే కాదు. విభిన్నమైన పాత్ర. ప్రేక్షకులు తప్పకుండా నా పాత్రకు కనెక్ట్ అవుతారు’ అంటూ నమ్మకం వ్యక్తం చేసింది కథానాయిక రితికా నాయక్. మెగా హీరో వరుణ్‌తేజ్‌కి జోడీగా ఆమె నటించిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో రితికా నాయక్ విలేకరులతో ముచ్చటించింది.
‘ఇందులో నేను సెల్ఫ్ ఇండిపెండెంట్. మోడరన్ అమ్మాయిని. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో భిన్నమైన పాత్ర ఇది. వరుణ్‌తేజ్‌తో కలసి నటించడం గొప్ప ఎక్స్పీరియన్స్. తనొక పనిరాక్షసుడు. వృత్తిపట్ల డెడికేషన్ ఉన్న నటుడు. గాయాలను సైతం లెక్కచేయకుండా ఈ సినిమాకు పనిచేశారు’ అని తెలిపింది రితికా నాయక్. ‘యూవీ క్రియేషన్స్ అద్భుతమైన నిర్మాణ సంస్థ. రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. షూటింగ్ టైమ్‌లో అనారోగ్యానికి గురయ్యాను.
ఆ సమయంలో నిర్మాతలు నా గురించి ఎంతో కేర్ తీసుకున్నారు’ అంటూ రితికా గుర్తుచేసుకున్నారు. ఇప్పటివరకూ వచ్చిన హారర్ కామెడీ సినిమాలకు ఇది పూర్తి భిన్నమని, కథలోని ఇండియన్, కొరియన్ నాగరికతలు కొత్త అనుభూతినిస్తాయని, సత్య, వీటీవీ గణేశ్.. ఇలా మంచి హాస్యనటులు నటించారని, సాంకేతికంగా కూడా సినిమా రిచ్‌గా ఉంటుందని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమా ఇదని రితికా పేర్కొన్నారు.