హైదరాబాద్, జులై 27 (నమస్తే తెలంగాణ): హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ పోస్టు నుంచి తప్పించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా పేరుతో పేదల ఇండ్లపై దమనకాండ సాగించిన కాంగ్రెస్ సర్కార్ పాపం పండిందంటూ బాధితులు సంబురపడుతున్నారు. ఈ క్రమంలో బాధితులు తమకు బీఆర్ఎస్ చేసిన సాయం, అండగా నిలిచిన సందర్భాలను గుర్తుచేసుకుంటున్నారు. పెద్దలను చుట్టంగా, పేదలను శత్రువులుగా పరిగణిస్తూ హైడ్రా చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. లక్షల మంది పేదలు హైడ్రా దెబ్బకు నిరాశ్రయులై రోడ్డున పడ్డారు.
అయితే హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ రక్షణ కవచంగా నిలిచింది. సర్కార్ విధ్వంసకాండకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేసింది. నిస్సహాయులుగా మిగిలిపోయిన బాధితులకు తామున్నామంటూ బాసటగా నిలిచింది. బాధితుల పక్షాన అలుపెరుగని పోరాటం చేసింది. ఏకంగా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వమే రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శానససభా ఉపపక్ష నేత హరీశ్‌రావు స్వయంగా హైడ్రా కూల్చిన ఇండ్ల వద్దకు వెళ్లి బాధితులకు అండగా నిలిచారు. మరికొన్ని చోట్ల హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి రాకుండా బీఆర్ఎస్ రక్షణ కవచంగా నిలిచింది.
ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ విధ్వంసకాండకు పాల్పడింది. చెరువులు, కుంటలను కాపాడుతున్నామనే సాకుతో పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు దూసుకొచ్చాయి. ఇలా మూసీ పరీవాహక ప్రాంతాలతో పాటు అమీన్పూర్, పటాన్చెరు, మాదాపూర్, ఖాజాగూడ, నార్సింగి, మణికొండ, శంషాబాద్, బాచుపల్లి, కూకట్పల్లి, చందానగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, షాహీన్‌నగర్ కుబా కాలనీలో పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిందనే ఆరోపణలున్నాయి. రాత్రికిరాత్రే ఇండ్లపైకి బుల్డోజర్లు దూసుకొచ్చేవి. కష్టపడి రూపాయిరూపాయి పోగేసి నిర్మించుకున్న ఇండ్లను కండ్ల ముందే కూల్చివేశాయి.
కొన్ని సందర్భాల్లో ఇండ్లలోని వస్తువులు సైతం తీసుకునే అవకాశం ఇవ్వలేదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, హెచ్చరికలు లేకుండా ఉన్నపళంగా ఇండ్లపై పడి విధ్వంసకాండ సృష్టించాయి. అప్పటి వరకు ఉన్న గూడును చెల్లాచెదురు చేశాయి. చెరువులు, కుంటలను కబ్జాదారుల నుంచి రక్షిస్తున్నామంటూనే పేదలను హైడ్రా నరకంలోకి నెట్టేసింది. కొన్ని సందర్భాల్లో అయితే న్యాయం కోసం కోర్టులకు వెళ్లకుండా చేసిన పరిస్థితులున్నాయి. శనివారం వచ్చిందంటే చాలు.. కోర్టులకు సెలవు చూసుకొని హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి దూసుకొచ్చేవి. రాత్రికిరాత్రే కలల సౌధాలను నేలమట్టం చేసేవి. దిక్కుతోచని స్థితిలో పిల్లలు, పండు ముసలి వాళ్లతో బిక్కుబిక్కుమంటూ బాధితులు కాలం గడిపిన పరిస్థితులున్నాయి.

హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేసిన అకృత్యాలు, అరాచకాలకు పేదలు బాధితులుగా మిగిలిపోయారు. కండ్ల ముందే కలల సౌధాలు నేలమట్టమవుతుంటే వారి రోదనలు మిన్నంటాయి. గూడు నేలకూలుతుంటే గుండెలవిసేలా ఏడ్చారు. పేదలపై కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పేదల పక్షాన నిలిచి పోరాడింది. హైడ్రా బుల్డోజర్లకు బీఆర్ఎస్ నేతలు ఎదురు నిలిచారు. కూల్చివేతలను అడ్డుకున్నారు. అలా పేదలకు, వారి ఇండ్లకు రక్షణ కవచంగా నిలిచారు. కేటీఆర్, హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, సుధీర్‌రెడ్డి, మధుసూదనాచారి, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇలా బీఆర్ఎస్ నేతలంతా బస్తీల్లో పర్యటించి హైడ్రా బాధితులకు అండగా నిలిచారు. తామున్నామంటూ వారికి గుండె ధైర్యాన్ని కల్పించారు. బాధితులను ఓదార్చి వారి కన్నీళ్లు తుడిచారు.
ఒకవేళ కాంగ్రెస్ సృష్టించిన హైడ్రా విధ్వంసకాండను బీఆర్ఎస్ ఎదురించకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పోరాటంతో చాలా చోట్ల హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి వెళ్లాలంటే జంకాయి. బీఆర్ఎస్ పోరుకు ముందు విచ్చలవిడగా ఇండ్లపై పడి అకృత్యాలు చేసిన హైడ్రా.. బీఆర్ఎస్ పోరుతో భయంలోకి వెళ్లింది. పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని బీఆర్ఎస్ ఎదురిస్తుందని, సర్కార్ దమననీతిని ఎండగడుతుందనే భయంతో వెనక్కి తగ్గిన పరిస్థితులున్నాయి.
పేదల గూడును చెదరగొడుతున్న హైడ్రాను నామరూపాల్లేకుండా చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను బంగాళాఖాతంలో పడేస్తామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేటీఆర్, హరీశ్‌రావు సైతం ప్రకటించారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టంచేశారు.
పేదల ఇండ్లపై కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో సృష్టించిన విధ్వంసాన్ని బీఆర్ఎస్ నిలువరించగలిగింది. బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావు రంగంలోకి దిగి బాధితుల పక్షాన పోరాటం చేయడంతో హైడ్రా వెనక్కి తగ్గింది. అంతకు ముందు ఇష్టమొచ్చినట్టు పేదల ఇండ్లపై విరుచుకుపడ్డ హైడ్రా.. బీఆర్ఎస్ పోరాటంతో పేదల ఇండ్ల జోలికి రావాలంటే ఆలోచించే పరిస్థితి కల్పించింది. బీఆర్ఎస్ బాధితుల పక్షాన నిలిచి పోరాటం చేసింది. దీంతో హైడ్రా బాధితులు బీఆర్ఎస్ భవన్‌కు క్యూ కట్టారు. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న దమనకాండపై వారి గోడు వెళ్లబోసుకున్నారు. రోజూ వందలాది మంది బాధితులు బీఆర్ఎస్ భవన్ గడప తొక్కేవారు. ఇలా వేల మంది కాంగ్రెస్ సర్కార్ బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. వారికి కావాల్సిన న్యాయ సహాయంతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. ఒక విధంగా బీఆర్ఎస్ భవన్ జనతా గ్యారేజీని తలపించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
హైడ్రా బాధితుల్లో మెజారిటీ ప్రజలు నిరుపేదలే. తమ ఇండ్లు కూల్చివేసిన హైడ్రాకు వ్యతిరేకంగా ఏమీ చేయలేని నిస్సహాయులే. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నవాళ్లే. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలు ఖర్చు చేసి హైడ్రాపై న్యాయ పోరాటం చేయడం వారికి సాధ్యంకాని పని. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వారి పక్షాన నిలిచింది. వారికి న్యాయ సహాయం అందించేలా చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగానే హైడ్రా బాధితుల పక్షాన న్యాయ పోరాటం చేసేందుకు ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేసింది. ఇందులో సీనియర్ న్యాయవాదులను, బీఆర్ఎస్ లీగల్ టీమ్ లాయర్లను భాగస్వామ్యం చేసింది. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన లీగల్ టీమ్ హైడ్రాకు వ్యతిరేకంగా కోర్టుల్లో పేదల పక్షాన పిటిషన్లు దాఖలు చేయడం, వాదనలు వినిపించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నది. లక్షలు ఖర్చయ్యే న్యాయ సేవలను పేదలకు బీఆర్ఎస్ ఉచితంగా అందించింది.