Sholay 2 | స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా.. శుక్రవారం న్యూజిలాండ్‌తో తొలి టీ20లో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి పోరుకు రాంచీ స్టేడియం వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు జట్లు జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకోగా.. పొట్టి ఫార్మాట్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. జార్ఖండ్ డైనమైట్, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో దిగిన ఫొటోలు ట్విట్టర్లో పెట్టిన హార్దిక్.. ‘షోలే కమింగ్ సూన్’ అని రాసుకొచ్చాడు. మహేంద్రుడి సారథ్యంలోనే జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న ఈ బరోడా ఆల్‌రౌండర్.. ఆ తర్వాత తన విలువ చాటుకుంటూ జట్టు పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే.
మైదానం లోపల, బయట ధోనీ, పాండ్యా మధ్య మంచి అనుబంధం ఉండగా.. తొలి మ్యాచ్ ఆడేందుకు రాంచీ వచ్చిన సందర్భంగా పాండ్యా.. తన ఆదిగురువు మహీభాయ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ బాలీవుడ్ ఎవర్గ్రీన్ చిత్రం.. ‘షోలే’ తరహాలో ఫొటోలకు ఫోజులిచ్చారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలా మోటర్ బైక్‌పై దిగిన ఫొటోలను పాండ్యా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇందులో హార్దిక్ పాండ్యా డ్రైవింగ్ సీట్‌పై కూర్చొని ఉండగా.. ధోనీ సైడ్ కార్లో ఠీవీగా ఆసీనుడయ్యాడు. దీనికి పాండ్యా వినూత్న క్యాప్షన్ పెట్టడంతో అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక 1975లో విడుదలైన షోలే చిత్రం బాలీవుడ్ చరిత్రలోనే క్లాసిక్‌గా నిలిచిపోయింది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర స్నేహాన్ని అభిమానులకు పరిచయం చేస్తూ.. బైక్‌పై చత్రికరించిన ‘ఏ దోస్తీ.. హమ్ నహీ ఛోడేంగే’ పాట ఆల్‌టైమ్ బెస్ట్‌లో ఒకటిగా నిలిచింది. యాంగ్రి యంగ్‌మ్యాన్ అమితాబ్ సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్, ధర్మేంద్ర హాస్యం, అంజద్ ఖాన్ విలనీ, హెమమాలినీ అందచందాలు, సంజీవ్ కుమార్ నటన ఈ చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్‌గా నిలిపాయి.
Sholay 2 coming soon 😉 pic.twitter.com/WixkPuBHg0
— hardik pandya (@hardikpandya7) January 26, 2023
దేశంలో మరే సారథికీ సాధ్యం కాని రీతిలో రెండు ప్రపంచకప్‌లు అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వికెట్ల మధ్య చిరుతను తలపించే వేగం.. వికెట్ల వెనుక చాణక్యుడిని మించిపోయే బుద్ధిబలంతో టీమ్ఇండియాకు లెక్కకు మిక్కిలి విజయాలు అందించిన ధోనీ.. రిటైర్మెంట్ అనంతరం కేవలం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే కెరీర్ ఆరంభం నుంచే బైక్‌లంటే తెగ ఇష్టపడే ధోనీ.. తన గ్యారేజ్‌లో ఎన్నో రకాల ద్విచక్రవాహనాలు, కార్లు సేకరించాడు. అతడి అడుగు జాడల్లోనే నడుస్తూ ఎదిగిన హార్దిక్ పాండ్యాకు కూడా బైక్‌లంటే మహా మోజు కావడంతో వీరిద్దరూ ఇలా ఫొటోలకు ఫోజులిచ్చారు. శ్రీలంక, న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌లు క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు ధోనీ హోమ్ టౌన్ రాంచీలో శుక్రవారం కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్‌కు సీనియర్లను విశ్రాంతినివ్వగా.. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ కీలకం కానున్నారు.
MS Dhoni | ఎంఎస్ ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్.. వీడియో