కోహ్లి ఆల్టైమ్ గ్రేట్ వన్డే ప్లేయర్!

సిడ్నీ: టీమిండియాతో జరగనున్న తొలి వన్డేకు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు ఆస్ట్రేలియా టీమ్ వన్డే, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్. బహుశా.. కోహ్లి ఆల్టైమ్ గ్రేట్ వన్డే ప్లేయర్ కావచ్చు అని ఫించ్ అన్నాడు. అతన్ని అవుట్ చేయడంపై తాము ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పాడు. కోహ్లి ఇప్పటి వరకు 248 వన్డేల్లో 11867 పరుగులు చేశాడు. సగటు 59.34 కాగా.. అందులో 43 సెంచరీలు ఉన్నాయి. సచిన్ తర్వాత వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మన్ కోహ్లినే. ఈ రికార్డులు చాలా ఆల్టైమ్ బెస్ట్ వన్డే ప్లేయర్ కోహ్లినే అని చెప్పడానికి అని ఫించ్ అభిప్రాయపడ్డాడు. అతని రికార్డులు నిజంగా అద్భుతం. అతన్ని సాధ్యమైనంత త్వరగా అవుట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం అని ఫించ్ చెప్పాడు. మా ప్రణాళికలకు తగినట్లు ఆడి.. అతన్ని అవుట్ చేస్తామని అన్నాడు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే సిడ్నీలో శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9.10 నిమిషాలకు ప్రారంభమవుతుంది.