Mohammed Siraj | న్యూఢిల్లీ: సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్.. భారత వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. స్వదేశం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టులో హైదరాబాదీ సిరాజ్ చోటు దక్కించుకున్నాడు. గత కొంత కాలంగా టెస్టు బౌలర్‌గా కొనసాగుతున్న సిరాజ్‌ను సెలెక్టర్లు వన్డేలకు ఎంపిక చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు సిరాజ్‌ను పక్కకు పెట్టిన సెలెక్టర్లు టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు బదులుగా జట్టులోకి తీసుకున్నారు.
దీంతో బుమ్రా గైర్హాజరీలో పేస్ దళానికి హైదరాబాద్ స్పీడ్‌స్టర్ నాయకత్వం వహించనున్నాడు. సిరాజ్ రీఎంట్రీకి తోడు సెలెక్టర్లు గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. అయితే విజయ్ హజారే టోర్నీలో ఫామ్ నిరూపించుకోవడంతో పాటు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ) నుంచి ఫిట్‌నెన్ క్లియరెన్స్ అనుసరించి అయ్యర్ ఆడటం ఆధారపడి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. గాయంతో సఫారీల సిరీస్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి రాగా, విజయ్ హజారేలో రాణిస్తున్న వికెట్‌కీపర్ రిషబ్ పంత్ చోటు నిలబెట్టుకున్నాడు.
గిల్ గైర్హాజరీలో సఫారీలతో సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ కివీస్‌తో సిరీస్‌లో కీపర్‌గా కొనసాగనున్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు నిరాశే ఎదురైంది. స్వదేశం వేదికగా త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని హార్దిక్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టారు. దీనికి తోడు మ్యాచ్‌లో పది ఓవర్లు వేసేందుకు బీసీసీఐ సీవోఈ నుంచి హార్దిక్‌కు అనుమతి లభించలేదు. పొట్టి ప్రపంచకప్ టోర్నీకి ముందు రిస్క్ తీసుకోవద్దనుకుంటున్న మేనేజ్మెంట్ అందుకు అనుగుణంగా పాండ్యాను పరిగణనలోకి తీసుకోలేదు.
సఫారీలతో వన్డే సిరీస్‌లో సెంచరీతో రాణించిన యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు సెలెక్టర్ల నుంచి నిరాశే ఎదురైంది. రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ జతగా వన్డేల్లో రుతురాజ్ తొలి సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరోవైపు గిల్, అయ్యర్ రాకతో తిలక్‌వర్మ, ధృవ్ జురెల్ తమ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. తొలి ప్రాధాన్య కీపర్‌గా రాహుల్‌ను తీసుకున్న సెలెక్టర్లు దేశవాళీలో నిలకడగా ఆడుతున్న రిషబ్ పంత్‌కు రెండో కీపర్‌గా అవకాశమిచ్చారు.
బుమ్రా లేని వేళ పేస్ బాధ్యతలను సిరాజ్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్‌సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ పంచుకోనున్నారు. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్‌కుమార్‌రెడ్డి కొనసాగనుండగా, స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వ్యవహరించనున్నారు. స్సెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్యాదవ్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే ఒకే ఫార్మాట్ ఆడుతున్న రొకో ద్వయం రోహిత్, కోహ్లీని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశముంది.
జట్టు వివరాలు: గిల్(కెప్టెన్), రోహిత్, విరాట్ కోహ్లీ, రాహుల్, శ్రేయాస్ అయ్యర్, సుందర్, జడేజా, సిరాజ్, రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్‌పంత్, నితీశ్‌కుమార్, అర్ష్‌దీప్‌సింగ్, జైస్వాల్.
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం