Cigarettes : సిగరెట్లు తక్కువ ధరకు కావాలంటే వియత్నాం విమానం ఎక్కాలంటూ ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ పోస్టుపై కొందరు విమర్శలు చేస్తున్నారు. మరికొందరు సరదా కామెంట్స్ పెడుతున్నారు. పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని మరింత పెంచాలనే ప్రతిపాదనన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న నేపథ్యంలో రజత్ శర్మ అనే ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ ఈ పోస్టు పెట్టాడు.
రజత్ శర్మ సెబీ రిజిస్టర్డ్ (SEBI-registered) ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్. సనా సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు. న్యూయార్క్ క్వాలిఫైడ్ అటార్నీ కూడా. దేశంలో పాగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని పెంచాలనే ప్రభుత్వ ఆలోచన నేపథ్యంలో రెగ్యులర్ సిగరెట్ స్మోకర్లను ఉద్దేశించి ఆయన ఈ పోస్టు పెట్టారు. రెగ్యులర్‌గా సిగరెట్స్ తాగేవాళ్లు వియత్నాంకు వెళ్లి తెచ్చుకుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చని ఆయన తన పోస్టులో సూచించారు.
ఈ మేరకు భారత్, వియత్నాంలో సిగరెట్ల ధరల మధ్య తేడాను ఆయన పోల్చారు. భారత్‌లో మార్ల్బోరో లైట్స్ సిగరెట్స్ ప్యాకెట్ (20 సిగరెట్లు) ధర సుమారు రూ.400 ఉండగా.. వియత్నాంలో కేవలం రూ.120-130 మాత్రమే ఉంటుందని ఆ పోస్టులో పేర్కొన్నారు. భారత్ నుంచి వియత్నాంకు అప్ అండ్ డౌన్ విమానం టికెట్ ధర రూ.21 వేలు ఉంటుందని, రెగ్యులర్‌గా సిగరెట్లు తాగే అలవాటు ఉన్నవాళ్లు 75 ప్యాకెట్లు తెచ్చుకుంటే విమానం చార్జీలు కవర్ అవుతాయని తెలిపారు.
అయితే ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన కనిపిస్తోంది. ‘వియత్నాం వెళ్లి సిగరెట్లు తెచ్చుకోవడం కంటే ఆ అలవాటు మానేస్తే ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులు మొత్తం మిగులుతాయిగా’ అని ఓ నెటిజన్ విమర్శించారు. ‘నువ్వు సిగరెట్లకు బాగా అడిక్ట్ అయినట్టున్నావ్’ మరో నెటిజన్ స్పందించారు. వియత్నాం నుంచి 5 సిగరెట్ ప్యాకెట్స్ కంటే ఎక్కువ తీసుకురావడానికి కస్టమ్స్ విభాగం అనుమతించదని మరో నెటిజన్ గుర్తుచేశారు. సిగరెట్ ధర తక్కువని అక్కడికి వెళ్లి తెచ్చుకుంటే చార్జీలు, ట్యాక్స్‌లు తడి మోపెడవుతాయని ఇంకో నెటిజన్ విమర్శించాడు.