ఓదెల, మార్చి 4 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఎంపీడీవో వెన్నపురెడ్డి అనిల్ రెడ్డి ప్రారంభించారు. ఓదెల మండలంలోని 22 గ్రామపంచాయతీలలో 198 మంది వార్డు సభ్యులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రారంభ సభలో ఎంపీడీవో అనిల్ రెడ్డి మాట్లాడుతూ పల్లెలు స్వచ్ఛ గ్రామాలుగా వెలుగొందేలా మనందరం కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకొని గ్రామాలు అభివృద్ధి పథం వైపు దూసుకు వెళ్లే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
ఇందుకు గ్రామ పంచాయతీల నిర్వహణపై వార్డు సభ్యులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామాలలో పరిశుభ్రతతో పాటు పచ్చని చెట్లతో పరిడవిల్లే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ గైడ్ లైన్స్‌ను అందరం పాటిద్దాం అన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల కరదీపికలను, పెన్ను, నోటుబుక్కులను పంపిణీ చేశారు. మొదటి రోజు అంగన్వాడీ సేవలు, బాల రక్షక పథకాలపై వార్డు సభ్యులకు ఆయా శాఖల అధికారులు వివరించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.