ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Nov 10, 2020 , 18:40:21

చేతిలో హల్క్‌ బొమ్మతో స్టోయినిస్‌

చేతిలో హల్క్‌ బొమ్మతో స్టోయినిస్‌

దుబాయ్‌:  స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌..ఢిల్లీ క్యాపిటల్స్‌  ఐపీఎల్‌-13 ఫైనల్‌కు తొలిసారి చేరడంలో కీలక పాత్ర పోషించాడు.   సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో స్టోయినిస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. లీగ్‌లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చిన మార్కస్‌..రైజర్స్‌ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ ఆది నుంచే భారీ షాట్లతో చెలరేగాడు. ధావన్‌తో కలిసి జట్టుకు మెరుగైన శుభారంభాన్నివ్వడంలో కీలకమయ్యాడు. 

బౌలింగ్‌కు దిగిన తొలి ఓవర్లోనే మనీశ్‌ పాండేతో పాటు ప్రియమ్‌ గార్గ్‌ను ఔట్‌ చేసి రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా..క్రీజులో పాతుకుపోయి అర్ధసెంచరీతో ఆకట్టుకున్న కేన్‌ విలియమ్సన్‌ వికెట్‌ను కూడా స్టోయినిస్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

అయితే వికెట్‌ తీసిన ప్రతిసారి..ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ హల్క్‌ను తలపిస్తూ సహచరులతో కలిసి సంబురాలు చేసుకున్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత చేతిలో హల్క్‌ బొమ్మతో కనిపించిన స్టోయినిస్‌ అసలు విషయం చెప్పాడు. స్టాన్‌ లీ-జాక్‌ కిర్బీ రూపొందించిన  మార్వెల్‌ కామిక్స్‌లో హల్క్‌ పాత్ర తన స్ఫూర్తి అని స్టోయినిస్‌ చెప్పుకొచ్చాడు. బ్రూస్‌ బ్యానర్‌ పోషించిన  హల్క్‌ పాత్ర తనకెంతో ఇష్టమని అన్నాడు.