IPL 2025 : ఐపీఎల్లో కొత్త ఛాంపియన్‌ను చూసి చాలా రోజులవుతోంది. తొలి సీజన్లో(2008) రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals).. ఆపై దక్కన్ చార్జర్స్.. 2022లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మినహాయిస్తే సింహభాగం టైటిళ్లు చెన్నై సూపర్ కింగ్స్(CSK), ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్లవే. సన్‌రైజర్స్ ఒకటి.. కోల్‌కతా మూడేసీ ట్రోఫీలతో మాజీ ఛాంపియన్లు అనుపించుకోగా.. కొన్ని జట్లు మాత్రం ఆ హోదా కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నాయి. అందని ద్రాక్షలాంటి ఐపీఎల్ ట్రోఫీని ఒక్కసారి గెలిచినా చాలు అనుకునే జట్లకు ఇప్పుడు ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ సవాల్ విసురుతోంది.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల నడుమ వాయిదా పడిన లీగ్.. మే 17 నుంచి పునః ప్రారంభమైంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..ఎంచక్కా ఫైనల్ చేరింది. క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌కు చెక్ పెడుతూ టైటిల్ కోసం కాచుకొని ఉంది. అయితే.. రెండో బెర్తును తేల్చేసే క్వాలిఫయర్ 2కు మరికాసేపట్లో తెరలేవనుంది.
ట్రోఫీతో రాజస్థాన్ ఆటగాళ్ల సంబురం
తొలి ట్రోఫీ గెలవాలనుకుంటున్న పంజాబ్‌కు అడ్డుగోడలా ఐదుసార్లు ఛాంపియన్ ముంబై నిలబడింది. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ముచ్చెమటలు పట్టించిన పాండ్యా సేన.. పంజాబ్‌పై విజయగర్జనకు సిద్ధమైంది. అయితే.. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన శ్రేయాస్ అయ్యర్ బృందాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. సో.. టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేది ఎవరు? అనేది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
పద్దెనిమిదో ఎడిషన్‌లో హాట్ ఫేవరెట్ జట్లలో కొన్ని లీగ్ దశ దాటలేకపోయాయి. కానీ ఆర్సీబీ, పంజాబ్, ముంబై, గుజరాత్‌లు ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లాయి. కానీ.. ఆ తర్వాత కప్పు కోసం ఉత్కంఠ పోరాటాల్లో ఊహించని ట్విస్ట్‌లు. ఆరంభ సీజన్ నుంచి కప్ కోసం నిరీక్షిస్తున్న బెంగళూరు క్వాలిఫయర్ 1లో పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. హేజిల్‌వుడ్(3-21), సుయాశ్ శర్మ(3-17)ల విజృంభణతో అయ్యర్ సేన 101కే కుప్పకూలింది.
అనంతరం.. ఎలిమినేటర్‌లో రోహిత్ శర్మ(81) విధ్వంసంతో భారీ స్కోర్ చేసిన ముంబైకి గుజరాత్ బదులు చెప్పలేకపోయింది. 229 పరుగుల ఛేదనలో సుదర్శన్ రాణించినా బుమ్రా దెబ్బకు గిల్ సేన తోకముడిచింది. 20 రన్స్ తేడాతో గెలుపొందిన ముంబై కొండంత ఉత్సాహంతో క్వాలిఫయర్ 2కు సిద్దమైంది. ఈ నాకౌట్ పోరులో ముంబై ఆటగాళ్లు సమిష్టిగా రాణించారంటే పంజాబ్ ఆశలు ఆడియాశలు అయినట్టే.
యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(431 పరుగులు), ప్రభ్‌సిమ్రన్(517 పరుగులు)ల జోడీ సూపర్ క్లిక్ కావడంతో లీగ్ దశ నుంచి దుమ్మురేపుతూ వచ్చిన పంజాబ్ కింగ్స్ అలవోకగా ప్లే ఆఫ్స్ చేరుకుంది. కానీ, ముంబై ఇండియన్స్ ప్రయాణం అది కాదు. వరుసగా 13వ సీజన్‌ను ఓటములతో మొదలెట్టిన ముంబై.. వాంఖడేలో కోల్‌కతాపై తొలి విజయాన్ని రుచి చేసింది. అనంతరం మళ్లీ ఓటమి. అయినా పాండ్యా సేన ఆశలు వదిలేయలేదు. ఓ సమిష్టిగా రాణిస్తూ.. వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది.
ఛాంపియన్ ఆటతో ప్రత్యర్థులకు చెక్ పెట్టిన ముంబై.. ఆరో టైటిల్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గతంలో రోహిత్ సారథ్యంలో ఆరుసార్లు ఫైనల్ చేరిన ఎంఐ.. ఏకంగా 5 సార్లు కప్‌ను తన్నుకుపోయింది. సో.. తమ తొలి టైటిల్ కల సాకారం కావాలంటే పంజాబ్ అత్యుత్తమ ఆట ఆడాలి. బుమ్రా, బౌల్ట్, శాంట్నర్‌లను దీటుగా ఎదుర్కోవడంపై అయ్యర్ సేన ఫైనల్ బెర్తు నిర్ణయం కానుంది.