Asia Cup 2025 | వచ్చే ఏడాది పురుషుల ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరుగనున్నది. ఈ ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. అయితే, 2027లో బంగ్లాదేశ్‌లో నిర్వహించనున్న ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్ జరుగనున్నది. 2023లో ఆసియా కప్‌ను హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. వన్డే ఫార్మాట్లో నిర్వహించగా.. పాక్‌కు ఆతిథ్య హక్కులు లభించగా.. టీమిండియా మ్యాచులన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ జారీ చేసిన స్పాన్సర్షిప్ హక్కుల కోసం నిర్వహించిన బిడ్డింగ్‌లో భారత్ ఆతిథ్య హక్కులను దక్కించుకున్నది. మొత్తం 13 మ్యాచులు జరుగనుండగా.. భారత్, పాకిస్థాన్, శ్రీలంక,
బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు మరో జట్టును క్వాలిఫైయింగ్ ఈవెంట్ ద్వారా ఎంపిక చేయబడింది.
అయితే, మ్యాచులు జరిగే తేదీలను ఖరారు చేయనప్పటికీ.. భారత్‌లో వర్షాకాలం ముగిసిన అనంతరం సెప్టెంబర్‌లో నిర్వహించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం (FTP) 2023-27 ప్రకారం.. భారతదేశం వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడనున్నది. ఆ తర్వాత ఫిబ్రవరి-మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్నది. ఆ తర్వాత ఐపీఎల్ ఉంటుంది. అనంతరం వన్డేలు, టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్‌కు వెళ్లేముందు జూన్ నుంచి ఆగస్టు వరకు ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నది. బంగ్లాదేశ్ సిరీస్ అనంతరం అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ఆసియా కప్ నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే, వేదికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. 2026లో పురుషుల ఆసియా కప్ టోర్నీ ఉండదు. మహిళల ఆసియా కప్ ఆ సంవత్సరం టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు.