కాగజ్‌నగర్, మార్చ్ 7 : సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతకావడంలేదని మరోసారి రుజువైందని, శిల్పకళా వేదికగా జరిగిన ఉద్యోగుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాటలే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ ష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవాచేశారు. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామంలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
రైతుభరోసా, రైతు రుణమాఫీ ఎంతమందికి అందించారనేది ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డికే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుందని ప్రశ్నించారు. రైతుభరోసా, రైతు రుణమాఫీకి ఎన్ని నిధులు విడుదల చేశారో తెలియదు, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు చేస్తున్న మైనింగ్ దందా గురించి తెలియదు, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ గురించి తెలియదు.. మరి ముఖ్యమంత్రికి ఇంకేం తెలుసని ప్రశ్నించారు. కేబినెట్ నిర్ణయం తీసుకొని, ఆర్థిక శాఖ ద్వారా నిధులు విడుదలైతేనే నిధులు అందుతాయని ముఖ్యమంత్రికి తెలియదా అంటూ ధ్వజమెత్తారు.
అధికారులే దందాల చేస్తున్నరా.. కాంగ్రెస్ నాయకులు, మంత్రులు దందాలు చేయడం లేదా అంటూ ప్రశ్నించారు. ఎస్పీలు, ఎస్ఐ, సీఐలు దందాలు చేస్తుంటే హోం మంత్రిగా రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారు? ఒకసారైనా హోంశాఖ మీద రివ్యూ చేశారా అంటూ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీల గురించి చెబితే ప్రజలు నమ్మి ఓటేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసంచేసి, నేడు రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.