Bangladesh Squad : ఇటీవలే జింబాబ్వే చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన బంగ్లాదేశ్(Bangladesh) ఈసారి ఆస్ట్రేలియా (Australia) పర్యటనకు సిద్ధమవుతోంది. ఆగస్టులో కంగారూలతో రెండు టెస్టుల సిరీస్ నేపథ్యంలో ఆదివారం బంగ్లా సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. నజ్ముల్ హుసేన్ శాంటో సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. సీనియర్ ఆటగాడు లిటన్ దాస్, పేసర్లు నహిద్ రానా, తంజిమ్ హసన్ షకీబ్‌లు గాయాల బారిన పడడంతో తొలి టెస్టుకు మాత్రమే స్క్వాడ్‌ను ఎంపిక చేశామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వెల్లడించింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా పటిష్టమైన ఆస్ట్రేలియాను ప్రధాన పేసర్లు లేకుండానే బంగ్లాదేశ్ ఢీకొట్టనుంది. ఇటీవల నిలకడగా రాణిస్తున్న నహిద్ రానా, తంజిమ్ హసన్ షకీబ్‌లు గాయాలతో అందుబాటులో లేరు. అలానే.. సీనియర్ బ్యాటర్ లిటన్ దాస్ సైతం తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్నాడు. దాంతో, వీరు ఫిట్నెస్ సాధించేందుకు సమయం పట్టనుంది. అందుకని ముందుగా తొలి టెస్టుకు మాత్రమే సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. నజ్ముల్ హుసేన్ శాంటో కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ఆదివారం ఎంపిక చేశారు.
Bangladesh announce their squad for the 1st Test against Australia 🇧🇩 pic.twitter.com/rf64jsYdho
— Cricinfo (@cricinfo) July 26, 2026
గత 23 ఏళ్లలో తొలిసారి కంగరూ గడ్డపై టెస్టులు ఆడేందుకు వెళ్తోంది బంగ్లాదేశ్. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆసీస్‌తో ఆగస్టు 13న డార్విన్ మైదానంలో బంగ్లా తలపడనుంది. అనంతరం ఆగస్టు 22న మెక్‌కేలో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరుగనుంది. రెండో మ్యాచ్‌కు స్క్వాడ్‌ను త్వరలోనే వెల్లడిస్తామని బీసీబీ పేర్కొంది.
చివరిసారిగా బంగ్లా 2003లో ఆసీస్ పర్యటనకు వెళ్లింది. దాంతో, ఈ టెస్టు సిరీస్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్ నాలుగో ప్లేస్‌లో ఉంది.
బంగ్లాదేశ్ స్క్వాడ్ (తొలి టెస్టు కోసం): నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), మెహిది మిరాజ్(వైస్ కెప్టెన్), ముష్ఫికర్ రహీం, అమితె హసన్, సౌమ్యా సర్కార్, షద్మన్ ఇస్లాం, మొమినుల్ హక్, జకీర్ అలీ, తంజిద్ హసన్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్, ఎబడాట్ హొసేన్, మస్ఫిక్ హసన్.