Parle Biscuit : కేరళ (Kerala) లోని కన్నూరు జిల్లా (Kannur district) లో వినియోగదారుల హక్కులకు సంబంధించిన కీలక తీర్పు వెలువడింది. 150 గ్రాములు ఉండాల్సిన పార్లే బిస్కెట్ ప్యాకెట్ (Parle Biscuit Packet) లో కేవలం 125 గ్రాములు మాత్రమే ఉండటంతో వినియోగదారుడికి అనుకూలంగా కన్నూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సంచలన తీర్పునిచ్చింది. పార్లే బిస్కెట్స్ కంపెనీకి, విక్రయించిన రిటెయిలర్‌కు సంయుక్తంగా బాధితుడికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
కన్నూరు జిల్లా అంజరకండికి చెందిన టీపీ ఆశిక్ అనే వ్యక్తి 2024 జూలై 26న చక్కరక్కల్లోని మెట్రో హైపర్ మార్కెట్లో 150 గ్రాములుగా ముద్రించిన పార్లే 20-20 బిస్కెట్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. అయితే ఆ ప్యాకెట్‌పై సందేహం వచ్చి సమీపంలోని దుకాణంలో తూకం వేయగా కేవలం 125 గ్రాములు మాత్రమే ఉన్నట్లు తేలింది. దాంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సమయంలో తమ ఉత్పత్తులు పూర్తిగా ఆటోమేటెడ్ ప్రక్రియ ద్వారా తయారవుతాయని, కమిషన్ ముందుంచిన ప్యాకెట్ తమ కంపెనీకి చెందింది కాకపోవచ్చని పార్లే వాదించింది.
మరోవైపు బిస్కెట్లను పార్లే సంస్థే తయారు చేసిందని, బరువులో తేడా ఉంటే తయారీదారులదే బాధ్యతని మెట్రో హైపర్ మార్కెట్ స్పష్టంచేసింది. లీగల్ మెట్రోలాజికల్ విభాగం అందించిన నివేదికతోపాటు సాక్ష్యాధారాలను పరిశీలించిన కమిషన్ అధ్యక్షులు రవి సుష, సభ్యులు మొల్లీకుట్టి మాథ్యూ, కేపీ సజీశ్లతో కూడిన బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. తక్కువ బరువుతో కూడిన ఉత్పత్తులను విక్రయించడం సేవలలో లోపమని, దీని నుంచి రిటైలర్ బాధ్యతను విస్మరించలేరని కమిషన్ స్పష్టం చేసింది.
ఈ తీర్పు ప్రకారం పార్లే కంపెనీ రూ. 25,000 నష్టపరిహారం, రూ.10,000 కోర్టు ఖర్చులు చెల్లించాలి. అలాగే మెట్రో హైపర్ మార్కెట్ రూ.10,000 నష్టపరిహారం, రూ.5,000 కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించారు. ఈ మొత్తాన్ని తీర్పు వెలువడిన నెల రోజుల్లోపు చెల్లించాలని, లేదంటే వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.