హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అస్తవ్యస్త విధానాలతో అన్ని రంగాలనూ దెబ్బతీసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఔట్‌డోర్ అడ్వైర్టెజింగ్ మీడియాను కూడా ధ్వంసం చేసేందుకు కుట్రలకు దిగుతున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. జీవో 84 ద్వారా ఈ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. లక్షల మంది పేదలు ఆధారపడిన ఈ రంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన అనుయాయులు, బంధువులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో శనివారం ఔట్‌డోర్ మీడియా ఏజెన్సీ ప్రతినిధులు దాసోజు శ్రవణ్‌ను కలిశారు. జీవో 84తో ఔట్‌డోర్ మీడియా ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువుపెట్టారు.
అనంతరం ఆయన వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌డోర్ మీడియా రంగంలో 300 నుంచి 400 ఏజెన్సీలు లక్షమందితో పనిచేస్తూ.. ప్రకటనలు, హోర్డింగ్స్ నిర్వహణ, ఇన్స్టాలేషన్ లాంటి పనుల ద్వారా మరో నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. ఇంతటి కీలక రంగాన్ని పరిరక్షించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని భక్షించేందుకు యత్నించడం దుర్మార్గమని అన్నారు. ఒక దొంగ జీవోను తెచ్చి కొద్దిమందికి కట్టబెట్టే కుతంత్రానికి దిగుతున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తన బంధువులు, దగ్గరి వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వందలకోట్ల విలువైన ఔట్‌డోర్ మీడియాను మూడు, నాలుగు సంస్థలకు అప్పగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
ఒక్క ఉత్తర్వుతో సుమారు 3000 యాడ్స్, బిల్బోర్డ్స్ను ఏకపక్షంగా రద్దు చేయడంతో చిన్న ఏజెన్సీలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిశ్రమ ద్వారా ఏటా సమకూరే రూ.21 కోట్ల ఆదాయాన్ని దెబ్బతీసేందుకు పూనుకోవడంలోని మతలబేంటని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా జీవో 68 జారీచేసి భారీ హోర్డింగ్స్‌పై నియంత్రణలు విధించిందని గుర్తుచేశారు. కానీ రేవంత్ సర్కార్ జీవో 84 తెచ్చి పేదల జీవనాధారాన్ని ధ్వంసం చేసేందుకు యత్నిస్తున్నదని విరుచుకుపడ్డారు. జీవో 84ను రద్దుచేసి లక్షలాది కుటుంబాలను కాపాడాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ హోర్డింగ్‌ల పేరిట వందల కోట్ల అక్రమాలకు తెరలేపిందని దాసోజు ఆరోపించారు. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా కేబీఆర్ పార్క్ చుట్టూ వందలాది ఎల్ఈడీ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. పార్క్ పరిసర ప్రాంతాల్లో నెమళ్లు, అరుదైన పక్షులు, ఇతర జంతుజాలం ఉన్నాయని, చుట్టూ భారీ ఎల్ఈడీ హోర్డింగ్‌ల ఏర్పాటుతో జీవ వైవిధ్యం దెబ్బతినే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. నిత్యం అదే మార్గం గుండా ప్రయాణించే సీఎం రేవంత్‌రెడ్డికి ఈ హోర్డింగ్‌లు కనిపించడంలేదా? అని నిలదీశారు.