IND Vs SL | శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో కొనసాగుతున్నది. మూడు టీ20ల సిరీస్‌లో భారత జట్టు లీడ్‌లో ఉన్న జట్టు ఆగస్టు 2 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్‌కు సైతం రెడీ అవుతున్నది. ఇందులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సైతం కనిపించనున్నారు. ఈ ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు సైతం ఈ సిరీస్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొననున్నారు. తొలిసారిగా జట్టుకు ఎంపికైన హర్షిత్ రాణా సహా వన్డే జట్టులో రోహిత్, కోహ్లీ, ఆటగాళ్లు ఆదివారం శ్రీలంక చేరుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత టీ20 జట్టు మంగళవారం పల్లెకెలెలో చివరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఆటగాళ్లు రోహిత్ నేతృత్వంలోని జట్టుతో చేరనున్నారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత రోహిత్, కోహ్లీ, కుల్దీప్ యాదవ్ రంగంలోకి దిగనున్నారు.
ఇక లంకతో జరిగే వన్డే సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ సైతం జాతీయ జట్టులోకి పునరాగమనం చేయనున్నారు. గతేడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. వన్డే జట్టులోని ఆటగాల్లంతో కొలంబోలో అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేయనున్నారు. శ్రీలంకతో మూడు వన్డేలు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి. మొదటి మ్యాచ్ ఆగస్టు 2న, రెండో మ్యాచ్ ఆగస్టు 4న, మూడో మ్యాచ్ ఆగస్టు 7న జరుగుతుంది. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్, శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌తో కోచ్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. కానీ, కెప్టెన్ రోహిత్ శర్మతో వన్డే సిరీస్‌తో మొదలుకానున్నది. రోహిత్, గంభీర్ ఇద్దరు కలిసి గతంలో కనిపించారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య సమన్వయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీలు టీ20 ఇంటర్నేషనల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.