Tamil Nadu : పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం ఫలితంగా ఇతర దేశాలతోపాటు భారత్‌లో కూడా కమర్షియల్ వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దాంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి.
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన సీనియర్ అధికారులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. టీస్టాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ సహా ఆహార తయారీ కేంద్రాలు ఏవైనా ఎల్పీజీకి బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను ఉపయోగిస్తే.. ఒక యూనిట్ విద్యుత్‌పై రూ.2 సబ్సిడీ అందించనున్నట్లు ప్రకటించారు.
వంట గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో వంట కోసం గ్యాస్‌కు బదులుగా విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో వంటగ్యాస్ కొరత తీవ్రత తగ్గేవరకు సబ్సిడీ వర్తిస్తుందని పేర్కొన్నారు.