Priyanka Gandhi : నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak), చలో పార్లమెంట్ (Chalo Parliament) నేపథ్యంలో విద్యార్థులపై పోలీసుల దాడి ఘటనలపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పై విమర్శలు గుప్పించారు. దేశ యువత ఏ విజయం సాధించినా తన ఖాతాలో వేసుకునే ప్రధాని.. విద్యార్థులపై దాడులకు కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గురువారం పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులను తాను ఎంతో ప్రేమగా చూసుకుంటానని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టే ప్రధాని మోదీ వారిపై బాష్పవాయువు ప్రయోగించి లాఠీఛార్జ్ చేయించారని విమర్శించారు. అధికార పక్షానికి చెందిన ఎంపీలు పార్లమెంట్ బయట నిల్చొని ఆందోళన చేయడం ఎప్పుడైనా చూశామా..? అని అన్నారు. పార్లమెంట్ సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. మనం అసలు ప్రజాస్వామ్యంలోనే జీవిస్తున్నామా..? అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
పిల్లలు ఆందోళన చేస్తుంటే ఇంటర్నెట్ కట్ చేస్తున్నారని విమర్శించారు. వాళ్లు ఉగ్రవాదులు కాదని, ఆందోళన చేస్తున్న వారిపై బాష్పవాయువు ప్రయోగించారని, ఇష్టమొచ్చినట్లుగా లాఠీలతో కొట్టారని ప్రియాంకా మండిపడ్డారు. ఇదేం ప్రజాస్వామ్యం..? అని ప్రశ్నించారు. క్రీడల్లో పతకాలు సాధిస్తే తనవల్లే వచ్చిందంటూ మోదీ ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుంటారని, శాస్త్రవేత్తలు అంగారకుడిపైకి వెళ్లినా, రాకెట్లు ప్రయోగించినా వాటిని తన ఖాతాలోనే వేసుకుంటారని ఆరోపించారు.
ప్రధాని మోదీ హయాంలో దాదాపు 152 పేపర్ లీకేజీలు జరిగాయని, వాటికి బాధ్యులెవరు..? అని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ప్రస్తుతం విద్యార్థులపై జరుగుతున్న దాడులకు బాధ్యులెవరు..? అని నిలదీశారు. విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న మోదీ.. వీటికి కూడా బాధ్యత వహించాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.