న్యూ ఢిల్లీ : ప్రతిపాదిత హైదరాబాద్-ముంబాయి హై-స్పీడ్ రైలు ( Bullet Train ) మార్గంలో జహీరాబాద్ స్టేషన్‌ను డీపీఆర్‌లో చేర్చాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ( MP Vaddiraju Ravichandra ) కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు( BRS MLAs ) చింతా ప్రభాకర్ , మాణిక్ రావు, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ శివకుమార్‌తో గురువారం న్యూ ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయి వినతిపత్రాన్ని అందజేశారు.
జహీరాబాద్ రైల్వే స్టేషన్లో బుల్లెట్ ట్రేన్కు స్టాప్ మంజూరు చేయాల్సిన ఆవశ్యకత, అవసరాన్ని మంత్రికి వివరించారు. ప్రతిపాదిత హైదరాబాద్–ముంబాయి హై-స్పీడ్ రైలు కారిడార్ దేశ ఆర్థిక సమగ్రత, పారిశ్రామికాభివృద్ధి, ప్రాంతీయ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే జాతీయ ప్రాజెక్ట్ అని వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.
జహీరాబాద్ ప్రస్తుతం దేశంలోని అత్యంత వ్యూహాత్మక పారిశ్రామిక ప్రాంతాలలో ఒకటిగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఇక్కడ భారత ప్రభుత్వం 12,656 ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్- మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్ ) స్థాపనకు ఆమోదం తెలిపిందని తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులలో ఒకటని, ఇప్పటికే 8,000 ఎకరాల భూమి సేకరణ పూర్తయి స్వాధీనం కూడా పూర్తయిందని వెల్లడించారు.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఇది భవిష్యత్తులో తయారీ, లాజిస్టిక్స్, ఎగుమతులు, పారిశ్రామిక ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదగనుందని వివరించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు వేలాది మంది రైతులు దేశ ప్రయోజనాల దృష్ట్యా తమ వ్యవసాయ భూములను స్వచ్ఛందంగా త్యాగం చేశారని, రైతుల త్యాగానికి గుర్తింపుగా ప్రపంచ స్థాయి రవాణా సదుపాయాలను కల్పించడం ద్వారా జహీరాబాద్ ప్రాంతం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని అన్నారు.
నిమ్జ్, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, డ్రై పోర్ట్, హైదరాబాద్–ముంబాయి ఎకనామిక్, హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ల వంటి మహత్తర ప్రాజెక్టుల సమ్మేళనం జహీరాబాద్‌ను జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యమైన తయారీ లాజిస్టిక్స్ కేంద్రంగా నిలబెట్టగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ప్రస్తుతం జహీరాబాద్‌లో మహీంద్రా గ్రూప్, అల్లానా గ్రూప్, పిరమల్ గ్రూప్, రాక్‌వూల్, ఆల్ఫ్ ఇంజినీరింగ్, ఎంజీ ఆటోమోటివ్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు అనేక ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్, ఫుడ్ ప్రాసెసింగ్ తయారీ పరిశ్రమలు విజయవంతంగా నడుస్తున్నాయని రైల్వే మంత్రికి ఎంపీ రవిచంద్ర వివరించారు.
అదనంగా నిమ్జ్ లో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా,వేమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రక్షణ విభాగానికి భూములు కేటాయించడం, శంకుస్థాపనలు కూడా జరిగాయని వారు తెలిపారు. జహీరాబాద్ దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక వృద్ధి కేంద్రాలలో ఒకటిగా అవతరించి, దేశ జీడీపీ, తయారీ ఉత్పత్తి, ఎగుమతులు, లాజిస్టిక్స్ సామర్థ్యం, దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి కీలకంగా దోహదపడుతుందన్నారు.
ఈ ప్రతిపాదిత కారిడార్ వెంట మూడు రాష్ట్రాల ప్రయాణికులను ఒకేసారి ఆకర్షించే ప్రత్యేక సామర్థ్యం కలిగిన ప్రాంతాలు ఉన్నాయని,ఇది దీర్ఘకాలంలో ప్రయాణికుల సంఖ్యను, ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుందని తెలిపారు.