Digestive System | ఫైబర్ శరీరానికి చాలా అవసరం. జీర్ణవ్యవస్థకు ఫైబర్ ఒక రాజు వంటిది అని చెప్పవచ్చు. కానీ అన్ని ఫైబర్లు ఒకేలా ఉండవు. ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటు అజీర్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక కడుపుకు ఇబ్బంది లేకుండా, కడుపు ఉబ్బరం రాకుండా, శరీరానికి స్థిరమైన శక్తిని ఇచ్చే అధిక ఫైబర్ ఉన్న స్నాక్స్ తీసుకోవడం మంచిది అని వైద్యులు చెబుతున్నారు. కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు చాలా మందిలో సాధారణంగా కనిపిస్తాయి. అలాంటి వారు ఈ స్నాక్స్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అమెరికన్ డైటరీ గైడ్‌లైన్స్ ప్రకారం, రెండు సంవత్సరాల పైబడిన వ్యక్తులు రోజుకు తీసుకునే ప్రతి 1,000 కేలరీలకు సుమారు 14 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. 12 నెలల నుంచి 23 నెలల మధ్య ఉన్న పిల్లలకు రోజుకు 19 గ్రాముల ఫైబర్ ఇవ్వాలి. ఫైబర్ ఆరోగ్యానికి చాలా అవసరం అయినప్పటికీ, అధిక ఫైబర్ ఉన్న ప్రతి ఆహారం సులభంగా జీర్ణం అవ్వాలని లేదు. కనుక తరచూ కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడే వారు జీర్ణ ఆరోగ్యానికి సహాయపడే విత్తనాలు, గింజలు, సంపూర్ణ ధాన్యాలు, పండ్లు తీసుకోవడం మంచిది. ఫైబర్ అధికంగా ఉండడంతో పాటు కడుపు ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణ వ్యవస్థకు మేలు చేసే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడికాయ గింజలు, సబ్జా గింజలు, పొడి చేసిన అవిసె గింజలు, చియా గింజలు వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అలాగే కొన్ని రకాల గింజల్లో ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ సులభంగా జీర్ణమవుతాయి. వాల్నట్స్, డ్రై రోస్టెడ్ పల్లీలు, మఖానా వంటివి సులభంగా జీర్ణమవ్వడంతో పాటు వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే బటర్, నెయ్యి వంటివి వేయకుండా ఎయిర్ పాప్ చేసిన పాప్ కార్న్ వంటి స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో పాటు సులభంగా జీర్ణమవుతాయి. అదే విధంగా స్ప్రౌటెడ్ బ్రెడ్, సవర్డో బ్రెడ్, స్టీల్-కట్ ఓట్స్ వంటి సంపూర్ణ ధాన్యాలతో చేసిన ఆహారాలు కూడా జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉండడంతో పాటు శరీరానికి ఎక్కువసేపు శక్తిని అందిస్తాయి. టెంపెహ్, ఫర్మ్ లేదా ఎక్స్ట్రా-ఫర్మ్ టోఫు వంటి మొక్క ఆధారిత ప్రోటీన్ ఆహారాలు సంతృప్తికరమైనవి. ఇవి తక్కువ ఉబ్బరాన్ని కలిగిస్తాయి. వీటిని ఫైబర్ అధికంగా ఉండే డైట్‌తో కలిపి తింటే కడుపుకు తేలికగా ఉంటుంది.
ఇక పండ్లు, కూరగాయలు సులభంగా జీర్ణం అవ్వడంతో పాటు అధిక ఫైబర్ ను కలిగి ఉంటాయి. ఉడికించిన క్యారెట్, బ్లూబెరీస్, స్ట్రాబెరీస్, రాస్ప్బెరీస్, కివీ పండు, ఆరెంజ్, మాండరిన్, కొంచెం పచ్చగా ఉన్న అరటిపండు, బొప్పాయి వంటి ఆహారాలు సులభంగా జీర్ణమవ్వడంతో పాటు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఇటువంటి ఆహారాల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో పాటు పొట్టకు కూడా తేలికగా ఉంటాయి. కడుపు ఉబ్బరంతో పాటు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు సులభంగా జీర్ణమవ్వడంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను గట్ ఫ్రెండ్లీ స్నాక్స్ ను ఎంచుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.