మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 03, 2020 , 19:11:58

ఫిఫా ప్రపంచకప్​నకు భారత్ అర్హత సాధించాలంటే : రిజిజు

ఫిఫా ప్రపంచకప్​నకు భారత్ అర్హత సాధించాలంటే : రిజిజు

న్యూఢిల్లీ: ఫుట్​బాల్​లో భారత్​ను తిరుగులేని శక్తిగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశ నలుమూలల ఫుట్​బాల్​లో ప్రతిభావంతులను గుర్తించేందుకు ఐదు జోనల్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. భారత ఫుట్​బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ 36వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం నిర్వహించిన  వీడియో కాన్ఫరెన్స్​లో రిజిజు మాట్లాడారు. భవిష్యత్తులో ఫిఫా ప్రపంచకప్​తో పాటు ఒలింపిక్స్​కు భారత ఫుట్​బాల్​ జట్టు అర్హత సాధించాలంటే ఇప్పటి నుంచే 12ఏండ్ల లోపు చిన్నారులకు ఫుట్​బాల్ శిక్షణ ప్రారంభించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

“దేశ నలుమూలల్లోని ప్రతిభావంతులను గుర్తించాలి. 12ఏండ్లలోపు వయసున్న టాలెంటెడ్​ ఫుట్​బాల్​ ప్లేయర్లను గుర్తించి ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలా చేస్తే రానున్న 10-15 ఏండ్లలో భారత ఫుట్​బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్​తో పాటు ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తుంది. దీన్ని సాధించగమని నేను నమ్మకంతో ఉన్నా. భారత్​ను ఎదురులేని క్రీడాశక్తిగా తయారు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రపంచంలోనే అత్యంత పాపులర్​ క్రీడ అయిన ఫుట్​బాల్​ను మనం తేలిగ్గా తీసుకోకూడదు. దేశంలో ఫుట్​బాల్ అభివృద్ధి కోసం దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని కిరణ్ రిజిజు చెప్పారు. 


logo