హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనుసన్నలలోనే సింగరేణి టెండర్ల స్కాం (Coal mine ) జరిగిందని బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ( Dasoju Sravan ) ఆరోపించారు. బామ్మర్ది కళ్లల్లో సంతోషం కోసం బొగ్గు గనులను కట్టబెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
తన బామ్మర్ధికి తప్పుడు పద్దతిలో రేవంత్ రెడ్డి టెండర్ ఇచ్చాడా? లేదా? టెండర్లు ఏ కారణంతో రద్దు చేశారో భట్టి విక్రమార్క చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ బామ్మర్థి వేసిన టెండర్‌ను రద్దు చేశారో లేదో భట్టి వెల్లడించలేదని తెలిపారు. రద్దు చేయని వెనుక ఎవరి ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నాయో ప్రకటించాలన్నారు. సీబీఐ విచారణ చేయమంటే మీనమేషాలు ఎందుకు వేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.
భట్టి విక్రమార్క 40 ఏళ్ల రాజకీయ జీవితం పట్ల ఎవరికి అభ్యంతరం లేదని, అయితే 50 ఏళ్ల రాజకీయ జీవితం , తెలంగాణ సాధకుడు, రెండుసార్లు సీఎంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దిన కేసీఆర్‌ను నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి సంస్కారం, సభ్యత నేర్పించాలి కదా అంటూ నిలదీశారు. మిమ్మల్ని గౌరవించాలంటే మీరు ఎదుటి వాళ్లను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.