Sports | రాయపోల్, జనవరి 24 : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండల సీఎం కప్-2025 క్లస్టర్ లెవల్ క్రీడలను స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామారంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. మానసిక ఉల్లాసానికి క్రీడోత్సవాలు ఎంతో దోహద పడతాయన్నారు. చదువుతోపాటు విద్యార్థులు పాఠశాల స్థాయిలో రాణిస్తే గ్రామాలకు, పాఠశాలకు మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో జరిగిన క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను మండల స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. వాలీబాల్, ఖో ఖో, కబడ్డి, యోగ క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ రెడ్డి, పీఈటీ రవికుమార్, ఉపాధ్యాయులు, గొల్లపల్లి సర్పంచ్ తూర్పు లక్ష్మి రవి, ఉప సర్పంచ్ చిన్నోళ్ల భూపాల్, రామారం సర్పంచ్ ఉషిగారి స్వామి, ఉపసర్పంచ్ రెడ్డబోయిన పద్మ, సయ్యద్ నగర్ సర్పంచ్ షేక్ రూబీన, ఉపసర్పంచ్ పఠాన్ కమల్, క్లస్టర్ గ్రామాల పంచాయతీ కార్యదర్శులైన గొల్లపల్లి సెక్రటరీ విజయ్, టెంకంపేట్ సెక్రటరీ శశికాంత్, రామారం సెక్రటరీ బాలయ్య, సయ్యద్ నగర్ సెక్రటరీ ప్రసాద్, వివిధ గ్రామాల యువకులు పాల్గొని విజయవంతం చేశారు.
రామారం, సయ్యద్ నగర్, గొల్లపల్లి, టెంకంపేట్ క్లస్టర్ గ్రామాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.
