హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్ల పాలనలో మహిళలకు సముచిత స్థానం లభించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. జనాభాలో సగం ఉన్న మహిళలు అన్ని రంగాలలో తమ ప్రతిభాపాటవాలు చాటుతున్నారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన శనివారం మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. పురుషులతో సమానంగా వాలెంటీనా తెరెష్కోవా, కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్ వంటి మహిళలు వ్యోమగాములుగా అంతరిక్షంలోకి వెళ్లి తమ సత్తా చాటారని ప్రశంసించారు.
బీఆర్ఎస్ హయాంలో మహిళల సాధికారతకు కేసీఆర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. మహిళల భద్రత, సంక్షేమం, అభివృద్ధికి పాటుపడ్డారని గుర్తుచేశారు. రాజకీయాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంట్లో ఆమోదం కోసం కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. సత్యవతిరాథోడ్, సబితాఇంద్రారెడ్డి, పద్మాదేవందర్రెడ్డి వంటి వారికి బీఆర్ఎస్ హయాంలో మంత్రులు, డిప్యూటీ స్పీకర్ పదువులు ఇచ్చి గౌరవించారని చెప్పారు. మహిళలు విద్యావంతులు కావడం ద్వారా కుటుంబాలు, సమాజం తద్వారా దేశం బాగుపడుతాయని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో మరింత గొప్పగా రాణించి, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.