బడంగ్పేట్,ఆగస్టు17: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై కోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపు మేరకు మహేశ్వరం నియోజక వర్గంలోని మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్, సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. మహేశ్వరం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉన్న పథకాలను రద్దు చేయాలన్న ఆలోచన చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పథకాలను రద్దు చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ రోజు కూడా సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1.50లక్షల చెక్కులను నిలిపివేసిందని గుర్తు చేశారు.

పథకాలను రద్దు చేయడానికి కోర్టులను ఆశ్రయిస్తున్నారన్నారు. కోర్టు నాలుగు వాయిదాలు అడిగిన ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ వేయలేదన్నారు. అధికారంలోకి రాక ముందు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆరు గ్యారంటీలో తులం బంగారం కూడా ఉందన్నారు. ఇచ్చిన మాటను తప్పిన రేవంత్ రెడ్డిని మహిళలు ఎక్కడికి అక్కడ నిలదీయాలని పిలుపు నిచ్చారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు.
ప్రజా సంక్షేమ పథకానికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్, నవీన్, ప్రభాకర్, పాండు యాదవ్, అంబయ్య యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, కర్రొల చంద్రయ్య,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బడంగ్పేట్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఆనంద్ రెడ్డి, శ్రీనివాస్ రాజ్, పుట్టగల్ల సంతోష్, కొంతం రోహిత్ రెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్, అనిల్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్,ఆగస్టు17: కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపివేసేందుకు కుట్ర చేస్తోందని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించిందనే పేరుతో ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని బీఆర్ఎస్ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన భారీ ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

హైకోర్టు స్టే విధించినప్పుడు ప్రభుత్వం తరుపున గట్టిగా కౌంటర్ దాఖలు చేసి పథకాలను కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల వేళ చెప్పిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు అసలు పథకాన్నే ఎత్తేసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని కోర్టులో బలమైన కౌంటర్ దాఖలు చేసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ సహా అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హెచ్చరించారు.

ధర్నాలో పాల్గొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మాగంటి సునీతాగోపీనాథ్

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ నేతలు క్రిశాంక్, నాగేశ్, నివేదిత

నిరసన తెలుపుతున్న వెంగళరావునగర్ మాజీ కార్పొరేటర్ దేదీప్య విజయ్

ఆందోళన చేస్తున్న మాజీ మేయర్ మేకల కావ్య, బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్

ముషీరాబాద్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్

ఆందోళన చేస్తున్న ఖైరతాబాద్ నియోకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి

నిరసన తెలుపుతున్న మాజీ కార్పొరేటర్ సామలహేమ