మెదక్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మెదక్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్యర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు నిలిపేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి పేద ఆడబిడ్డల పెండ్లికి నగదు పంపిణీ చేసిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు పేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలోభాగంగా రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వం హైకోర్టులో ఎందుకు పిటిషన్ వేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలు తగిన గుణపాఠం చేపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎరువుల కొరత ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పునరుద్ధరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మెదక్‌లో ప్రధాన రోడ్డు పై ధర్నా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు ధర్నా చేయడంతో పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాకు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు దీపక్‌కుమార్, మల్లేశం పాల్గొన్నారు.