Gautam Gambhir : పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాల దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడడమే కాకుండా వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాదు దాయాదితో క్రికెట్ మ్యాచ్‌లకు ఫుల్స్టాప్ పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు వద్దే వద్దని గౌతీ స్పష్టం చేశాడు.
‘పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలా? వద్దా? అనే ప్రశ్నకు నేను వద్దనే చెబుతాను. ఉగ్రదాడులు ఆగేంతవరకూ దాయాదితో క్రికెట్ సహా ఏ ఆట కూడా ఆడే ప్రసక్తే లేదు. అయితే.. పాక్‌తో క్రికెట్ ఆడడంపై తుది నిర్ణయం ప్రభుత్వానిదే. భారతసైనికుల ప్రాణాలు, ప్రజల భద్రత కంటే పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు, బాలీవుడ్, ఇతర సంబంధాలు కూడా ముఖ్యం కాదని నేను ఇదివరకూ చెప్పాను’ అని గౌతీ వివరించాడు. అంతేకాదు కోచ్‌గా తన పని ఆటగాళ్లను సెలెక్ట్ చేయడ కాదని గంభీర్ చెప్పాడు. జూన్‌లో ఇంగ్లండ్ సిరీస్ ఉన్నందున ఎవరిని ఎంపిక చేయాలనేది తన జాబ్ కాదని సెలవిచ్చాడు.
❗Gautam Gambhir: “India shouldn’t PLAY against Pakistan, even in ICC events, until terrorism ends.”
— Do you AGREE with him…? pic.twitter.com/AuzvLCrzjz
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 6, 2025
‘కోచ్‌గా నా బాధ్యత ఆటగాళ్లను దారిలో పెట్టి జట్టును విజయపథాన నడిపించడమే. అంతేతప్ప ఆటగాళ్లను, టీమ్‌ను సెలక్ట్ చేయడం కాదు. ఆటగాళ్ల ఎంపిక అనేది పూర్తిగా సెలెక్టర్ల బాధ్యత. అందులో నా ప్రమేయం ఉండదు. వాళ్లు ఎంపిక చేసిన స్క్వాడ్‌లో మ్యాచ్‌కు అవసరమైన 11 మందిని తీసుకొని.. కోచింగ్ ఇస్తానంతే’ అని గంభీర్ తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ద్రవిడ్ వారసుడిగా కోచ్ పదవి చేపట్టిన గంభీర్.. శ్రీలంక పర్యటనలో కొంతమేర విజయవంతం అయ్యాడు. అయితే.. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో, ఆ పై ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ సేన చిత్తుగా ఓడింది. దాంతో, గౌతీ కోచింగ్‌పై సందేహాలు వ్యక్తం చేశారు పలువురు. ఈమధ్యే.. సహాయక సిబ్బందిలోని అభిషేక్ నాయర్‌పై వేటు వేసిన బీసీసీఐ అతడికి పెద్ద షాకిచ్చిన విషయం తెలిసిందే.