Nandini Gupta | హైదరాబాదీలు ఆప్యాయతను పంచుతారని మిస్ ఇండియా నందిని గుప్తా అన్నారు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్న విషయం తెలిసిందే. వివిధ దేశాల నుంచి వచ్చే అందాల భామల కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోటీల నిర్వహణపై హైటెక్ సిటీలో ప్రభుత్వం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మిస్ ఇండియా నందిని గుప్తా మాట్లాడారు. తెలంగాణ గురించి ప్రస్తావించిన ప్రతిసారీ తనకు గొప్ప అనుభూతి కలుగుతుందని చెప్పారు. ఈ ప్రాంత సంస్కృతి, అభివృద్ధి అద్భుతంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని.. ఇక్కడి ప్రజలు ఎంతో ఆప్యాయతను పంచుతారన్నారు.
హైదరాబాదీ బిర్యానీ నుంచి ఇరానీ చాయ్ వరకు స్థానిక వంటకాలు అమోఘమని.. అవి తనను కట్టిపడేశాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనే ప్రతి యువతి ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని నందిని గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. పోచంపల్లి చేనేత మగ్గాలు తనకు ఎంతో నచ్చాయని తెలిపారు. యంగెస్ట్ స్టేట్ అయినా కూడా ఇక్కడ హాస్పటాలిటీ బాగుందని కితాబిచ్చారు. ‘అందరికీ నమస్కారం.. తెలంగాణకు తప్పకుండా రండి’ ఈ సందర్భంగాలు పలుకరించింది. నందిని గుప్తా ఇప్పటికే తెలంగాణలోని పలు చారిత్రక కట్టడాలు, ఆలయాలు, పర్యాటక స్థలాలను సందర్శించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గురించి హర్షం వ్యక్తం చేశారు.