Sridhar Babu | ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై తమకు ఎలాంటి కక్ష లేదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆమెపై తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న ఆరోపణలను మంత్రి ఖండించిన ఆయన.. అధికారులు నియమ నిబంధనలు పాటించాలన్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అందాల పోటీల నిర్వహణ.. ఉద్యోగులతో సమస్యలతో ముడిపెట్టడం సరికాదని చెప్పారు. ఈ పోటీలు కేవలం సౌందర్యానికి సంబంధించిన కావని.. వ్యక్తిత్వానికి సంబంధించినవన్నారు. తెలంగాణ ప్రతిష్టను ప్రపంచస్థాయిలో పెంచేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును గత ప్రభుత్వమే పెంచిందని, రిటైర్మెంట్ ప్రయోజనాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తమ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని నడిపించే సత్తా ఉందో లేదో ప్రజలకు తెలుసునన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఉద్యోగ సంఘాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. విషయంపైనైనా ముక్కుసూటిగా మాట్లాడతారని, సీఎం వ్యాఖ్యలను ఆవేదనగానే పరిగణించాలన్నారు. ఉద్యోగుల డిమాండ్లను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందని, హామీలు ఇచ్చే సమయంలోనే అన్ని అంచనాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు.