Ben Stokes : ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. నిరుడు టీ20 వరల్డ్ కప్‌లో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ జోస్ బట్లర్(Jos Buttler) రాజీనామా చేయడంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పలువురు ఆటగాళ్లతో మంతనాలు జరుపుతోంది. అయితే.. సీనియర్ ఆటగాడు జో రూట్(Joe Root) సైతం ససేమిరా అనడంతో.. కుర్రాళ్ల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెస్టు, 20 సంచలనం హ్యారీ బ్రూక్ (Harry Brook), ఓపెనర్ బెన్ డకెట్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(Ben Stokes)కు పగ్గాలు అప్పగిస్తారనే కథనాలు ప్రచారం అవుతున్నాయి.
జూన్‌లో భారత జట్టుతో సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది ఇంగ్లండ్. ఒకవేళ స్టోక్స్‌ను వన్డే కెప్టెన్‌గా ఎంపిక చేస్తే .. అది ఇంగ్లండ్ బోర్డు స్వార్థపూరితమైన చర్య అని మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ (Michael Vaughn) మండిపడితున్నాడు. స్టోక్స్‌ను పూర్తిగా టెస్టులపై గురి పెట్టేలా చూడడమే మంచిదని వాన్ అభిప్రాయపడుతున్నాడు. ఫిట్నెస్ సమస్యగా మారనుంది. పైగా ఈమధ్యే మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న స్టోక్స్‌పై కెప్టెన్సీ భారం మోపవద్దని కొందరి వాదన. కాబట్టి.. యువకుడైన బ్రూక్‌ను వన్డే, టీ20లకు సారథిగా ఎంపిక చేయాలని పలువురు బోర్డుకు సూచిస్తున్నారు.
స్వదేశంలో జరిగిన 2019 వన్డే వరల్డ్ కప్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు స్టోక్స్. న్యూజిలాండ్‌తో ఆడిన ఫైనల్లో 84 నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు. స్లోర్లు సమం కావడంతో బౌండరీలు ఎక్కువ బాదిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు అధికారుడు. యావత్ దేశం కలను సాకారం చేసిన స్టోక్స్.. టెస్టులపై ఇష్టంతో 2022లో వన్డేల నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. అయితే.. జోస్ బట్లర్ విజ్ఞప్తి మేరకు 2023 ప్రపంచ కప్‌లో ఆడిన అతడు.. టోర్నీ ముగిశాక మోకాలి సర్జరీతో చేయించుకున్నాడు. ప్రస్తుతం ఫిట్నెస్ సాధించిన అతడు టెస్టులపైనే దృష్టి పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో మళ్లీ వన్డే సారథిగా ఉండేందుకు స్టోక్స్ అంగీకరిస్తాడా? తన వల్ల కాదంటూ చేతులెత్తేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.