కంఠేశ్వర్, మార్చి 13: జిల్లాలో వంటగ్యాస్ కొర త లేదని, ప్రజలెవరూ అందోళన చెందవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో వంటగ్యాస్ డిమాండ్, సరఫరా తీరుతెన్నులపై సమీక్షించారు. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోందని, శుక్రవారం నాటికి 10,850 సిలిండర్లు జిల్లాలో గృహావసరాల కోసం పంపిణీ నిమిత్తం అందుబాటులో ఉన్నాయని వీటికి అదనంగా మరో 5,875 సిలిండర్లు జిల్లాకు రానున్నాయని పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
సిలిండర్ బుక్ చేసిన వారికి మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో గృహావసరాల సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల పంపిణీని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో డెలివరీ బాయ్‌కి ఓటీపీ చెప్పి సహకరించాలని, వారి విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎల్పీజీ వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఇన్చార్జి అదనపు కలెక్టర్ దిలీప్‌కుమార్, ఏఎస్వో అరవింద్‌రెడ్డి, డీటీవో ఉమామహేశ్వర్రావు, డీపీవో శ్రీనివాస్‌రావు, డీడబ్ల్యూవో పద్మ, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిణి కృష్ణవేణి, జిల్లా వ్యవసాయాధికారి వీరస్వామి, ఆర్సీవోలు, గ్యాస్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు, ఎల్పీజీ డీలర్లు పాల్గొన్నారు