హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని బొగ్గులకుంటలో ఉన్న తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో 48 మందికి గ్రేడ్ 3 ఈవోలుగా, ఇద్దరికి గ్రేడ్ 2 ఈవోలుగా, ఒకరికి గ్రేడ్ 1 ఈవోగా ఉద్యోగోన్నతుల ఉత్తర్వులను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అందజేశారు. వీరితోపాటు అర్చక సంక్షేమ నిధి ద్వారా అర్హులైన 15మంది అర్చకులు, వారి కుటుంబసభ్యులకు బెనిఫిట్స్ పంపిణీ చేశారు.
దేవాదాయశాఖలో ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం, దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని మంత్రి కొండాసురేఖ తెలిపారు. బుధవారం ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఏడీసీలు శ్రీనివాసరావు, జ్యోతి, సీతా డైరెక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు, ఆర్జేసీ రామకృష్ణారావు, డీసీ వినోద్‌రెడ్డి, ఈవోల సంఘం అధ్యక్షుడు నరేందర్, దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి, అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఆర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.