మాదాపూర్, జూలై 29: సైబరాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణాలను బలితీసుకున్నది. ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు నాలా గుంతలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం ప్రేమ్‌నగర్ రైల్వేబ్రిడ్జి వద్ద చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాలయ్య (70) ముప్పై ఏండ్ల క్రితం కొండాపూర్‌లోని ప్రేమ్‌నగర్ బీ-బ్లాక్‌కు వలసవచ్చి నివాసం ఉంటున్నాడు.
ఈ నెల 28న సాయంత్రం 5 గంటల సమయంలో వైశాలినగర్‌లో ఉంటున్న తన కూతురు ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న బాలయ్య.. వైశాలినగర్ రైల్వే బ్రిడ్జి వద్ద పాత పైప్‌లైన్‌లో జారి పడి గల్లంతయ్యాడు. పనులు జరుగుతున్న చోట కార్పొరేషన్ అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకుం డా, కేవలం బారీకేడ్లను మాత్రమే ఉంచారు. ఆ వృద్ధుడికి రేచీకటి సమస్య ఉండటంతో అక్కడ జరుగుతున్న పనుల ను గమనించకుండా అటుగా వెళ్లి ప్రమాదవశాత్తు జారి పైప్‌లైన్‌లో పడిపోయాడు.
పాత పైప్లైన్లు చిన్నవిగా ఉండటంతో వాటి స్థానంలో నూతన పైప్లైన్లు ఏర్పాటు చేసేందుకు సీఎంసీ రూ.70 లక్షల వ్యయంతో వారం రోజుల కిత్రం నాలా విస్తరణ పనులు చేపట్టారు. అయితే, అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతంలో ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడంతో ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగాయి.