మహబూబ్ నగర్ కలెక్టరేట్ : టాస్ మహబూబ్ నగర్ జిల్లా కోఆర్డినేటర్ పోస్టులో అక్రమంగా నియమితులైన ఉపాధ్యాయుడు ఎం.శివయ్యను తొలగించాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం(GTA) నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాలశాఖ అతిథి గృహం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జీటీఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.రమేశ్, జంబు కిశోర్, గౌరవ అధ్యక్షుడు నాగం రఘురామిరెడ్డి తదితరులు మాట్లాడారు.
ప్రభుత్వ యాజమాన్య పరిధిలో అర్హులైన స్కూల్ అసిస్టెంట్‌ను నియమించాలని కోరారు. ప్రభుత్వ జీవో ప్రకారం లోకల్ బాడీ మేనేజ్మెంట్ టీచర్ ఈ పోస్టుకు అనర్హులన్నారు. శివయ్య నియామకం జీవో విరుద్దం అన్నారు. టాస్ కోఆర్డినేటర్ పోస్టును ప్రభుత్వ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్‌ను నియమించాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా, కొందరు అధికారులు ఇలాంటి అక్రమాలకు పాల్పడి అనర్హులకు పట్టం కడుతున్నారని ఆరోపించారు.
విద్యావ్యవస్థను సక్రమంగా నడిపించుటలో బాధ్యతగా కృషిచేయాల్సిన విద్యాశాఖ అధికారులు బాధ్యతారాహితంగా.. ప్రభుత్వ జీవోలకు తిలోదకాలు ఇస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. టాస్ జిల్లా సమన్వయకర్తకు సంబంధించిన జీవోలను, డైరెక్టర్ గారి ఉత్తర్వులను అన్నింటినీ స్పష్టంగా పేర్కొంటూ వివరిస్తూ వచ్చామని అన్నారు.
ఇప్పటికైనా విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు అధికారులు కళ్లు తెరవాలి. నిజానిజాలు తెలుసుకోవాలి. సానుకూలంగా ఆలోచించి ప్రభుత్వ ఉత్తర్వులను గౌరవించి న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కె నాగరాజు, కమిటీ సభ్యులు చంద్యానాయక్, గోపాల్, శ్రీనివాస్, వేదప్రకాశ్, జి శ్రీనివాసులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.