14 Days Girl Friend Intlo | తెలుగు యువ నటులు అంకిత్ కొయ్య, శ్రియా కొంతం జంటగా రూపొందిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘14డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’. ఈ సినిమాకు శ్రీహర్ష దర్శకత్వం వహించగా.. సత్య నిర్మించాడు. మార్చి 07న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌తో నడిచింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హర్ష (అంకిత్ కొయ్య) ఎప్పుడు ఫిల్మ్ మేకర్ అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. అయితే ఈ క్రమంలోనే హర్షకి ఒక డేటింగ్ యాప్‌లో ఆహాన (శ్రియ కొంతం) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఇద్దరి స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. ఆహాన తల్లిదండ్రులు ఒక రోజు పెళ్లికి వెళ్లడంతో ఇంట్లో ఎవరు లేరని హర్షను తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. అలా తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లిన హర్షకు అదే ఇంట్లో 14 రోజులు ఉండాల్సి వస్తుంది. ఆహాన తల్లిదండ్రులకు, తాతకు తెలియకుండా హర్ష ఆ ఇంట్లో అన్ని రోజులు ఎలా గడిపాడు? హర్షను దాచడంలో ఆహాన ఎలాంటి కష్టాలు పడింది? పెళ్లికి వెళ్లిన ఆమె తల్లిదండ్రులు ఎందుకు అనుకోకుండా త్వరగా తిరిగి వచ్చారు? ఆహానకు ఎదురైన మరో సమస్య ఏమిటి? ఆ సమస్య నుంచి ఆహాన, హర్ష ఎలా తప్పించుకున్నారు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను తప్పక చూడాలి.