T20 World Cup 2024 : తొలి సీజన్ చాంపియన్ అయిన టీమిండియా(Team India) పొట్టి వరల్డ్ కప్(T20 World Cup 2024)లో తొలి మ్యాచ్‌కు సమాయత్తమవుతోంది. అది కూడా పసికూనగా అరంగేట్రం చేసి సంచలన విజయాలకు కేరాఫ్ అయిన ఐర్లాండ్(Ireland)తో. బుధవారం న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. మెగా టోర్నీలో అదిరిపోయే బోణీ కొట్టేందుకు భారత జట్టుకు ఇదొక మంచి చాన్స్.
ఈ సందర్భంగా టీ20ల్లో ఐరిష్ జట్టుపై టీమిండియా రికార్డులు పరిశీలిస్తే.. ఏడుకు ఏడు మ్యాచుల్లో బ్లూ జెర్సీనే జయకేతనం ఎగురవేసింది. ఇక భారీ విజయం గురించి చెప్పాలంటే 2018లో భారత జట్టు ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. జూన్ 29న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 143 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. ఇక ఐరిష్ టీమ్‌పై భారత అత్యధిక స్కోర్ ఎంతంటే.. 255/7. మరి ఈసారి ఆ రికార్డును రోహిత్ శర్మ బృందం తిరగరాస్తుందా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

అయితే.. బౌలర్లకు అనుకూలిస్తున్న న్యూయార్క్‌లోని నిస్సౌ కౌంటీ స్టేడియంలో అత్యధిక స్కోర్.. 77 మాత్రమే. ఈ మైదానంలో దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జి(4/7) ధాటికి శ్రీలంక 19.1 ఓవర్లలోనే కుప్పకూలి టీ20 వరల్డ్ కప్ చరిత్రలో స్వల్ప స్కోర్ నమోదు చేసింది. ఒకవేళ భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తే.. భారీ స్కోర్ కొడుతుందా? లేదా ఐర్లాండ్‌ను లంక కంటే తక్కువ స్కోర్‌కే పరిమితం చేస్తుందా? అనేది ఆసక్తికరం. అయితే.. పాల్ స్టిర్లింగ్(Paul Stirling) సారథ్యంలోని ఐరిష్టీమ్ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఐపీఎల్ అనుభవం ఉన్న పేసర్ జోష్ లిటిల్ భారత బ్యాటర్లను ఇరుకున పెట్టడం ఖాయం.
