బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 06, 2020 , 01:54:06

ఐపీఎల్‌ నుంచి భువీ ఔట్‌

ఐపీఎల్‌ నుంచి భువీ ఔట్‌

  • సన్‌రైజర్స్‌కు భారీ ఎదురుదెబ్బ..ఆస్ట్రేలియా పర్యటనకూ అనుమానమే!

దుబాయ్‌: ఈ ఏడాది ఐపీఎల్‌లో ఒడిదొడుకుల మధ్య సాగుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గాయం కారణంగా లీగ్‌లో మిగిలిన అన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. గత శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19వ ఓవర్‌ బౌలింగ్‌ చేస్తూ భువీ గాయపడ్డాడు. కండరాల గాయం వల్ల భువనేశ్వర్‌ కుమార్‌ ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడు. అతడికి 6 నుంచి 8వారాల విశ్రాంతి అవసరం. ఆస్ట్రేలియా పర్యటనలోనూ భువీ ఆడడం అనుమానమే అని ఆ అధికారి చెప్పారు. చివరి ఓవర్లలో బౌలర్లు ధారాళంగా పరుగులు ఇస్తున్న నేపథ్యంలో.. నాలుగు మ్యాచ్‌ల్లో 7 కంటే తక్కువ ఎకానమీ రేట్‌తో పొదుపుగా బౌలింగ్‌ చేసిన భువీ నిష్క్రమించడం ఎస్‌ఆర్‌హెచ్‌కు పెద్ద ఇబ్బందే. ఇప్పటికే ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లో గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ మూడింట ఓడింది. ఈ ఏడాది ఆరంభంలో గాయం వల్ల కివీస్‌  పర్యటనకు దూరమైన భువనేశ్వర్‌.. డిసెంబర్‌లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనకు కూడా అందుబాటులో లేకుండా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అమిత్‌ మిశ్రా కూడా..

ఢిల్లీ క్యాపిటల్స్‌ సీనియర్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా కూడా చేతి వేలి గాయం వల్ల ఈ ఏడా ది ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడు. ఈ విషయా న్ని క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించా యి. గత శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బౌలింగ్‌లోనే నితీశ్‌ రాణా ఇచ్చిన క్యాచ్‌ను పట్టేక్రమంలో అమిత్‌ ఉంగరపు వేలికి గాయమైంది. ఈ ఏడాది మూడు మ్యాచ్‌లు ఆడిన మిశ్రా మూడు వికెట్లతో పాటు పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.