Ultraviolette F77 Mach 2 | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) స్టార్టప్ ఆల్ట్రావయోలెట్ తాజాగా భారత్ మార్కెట్లోకి తన ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్2 మోటారు సైకిల్ ఆవిష్కరించింది. సింగిల్ చార్జింగ్ చేస్తే 323 కి.మీ దూరం ప్రయాణించొచ్చు. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్-310 మోటారు సైకిల్‌కు గట్టి పోటీనిస్తుంది ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్2.ఈవీ బైక్. ఇంతకుముందు 2022 చివర్లో ఆవిష్కరించిన ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మోటారు సైకిల్ అప్ డేటెడ్ వర్షన్ బైక్ ఈ ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్2.
రెండు వేరియంట్లు – స్టాండర్డ్, రెకాన్, తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్2 బైక్. స్టాండర్డ్ వేరియంట్ బైక్ రూ.2.99 లక్షలు (ఎక్స్ షోరూమ్), రెకాన్ వేరియంట్ రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఈ ధరలు తొలి వెయ్యి మోటారుసైకిళ్ల బుకింగ్స్‌కు మాత్రమే వర్తిస్తాయి.
ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్2 (Ultraviolette F77 Mach 2) మోటారు సైకిల్ బుకింగ్స్ దేశంలోని 15 నగరాల్లో ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల వారు రూ.5000 చెల్లించి ఆల్ట్రావయోలెట్ అధికార వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. వచ్చే నెల నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు. ఈ మోటారు సైకిల్‌కు ఈవీ బైక్స్‌లో ఇప్పటి వరకూ పోటీ లేదు కానీ, ఐసీఈ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో కేటీఎం ఆర్సీ 390, బీఎండబ్ల్యూ జీ310ఆర్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 మోటారు సైకిళ్లకు గట్టి పోటీనిస్తుందీ బైక్. ఇక ఇంతకుముందే మార్కెట్లోకి వచ్చిన ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 స్టాండర్డ్ బైక్ రూ.3.80 లక్షలు (ఎక్స్ షోరూమ్), ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 రెకాన్ బైక్ రూ.4.40 లక్షలు (ఎక్స్ షోరూమ్), ఆల్ట్రా వయోలెట్ ఎఫ్77 స్పేస్ ఎడిషన్ బైక్ రూ.5.50 లక్షలు పలుకుతుంది.
ఆల్ట్రా వయోలెట్ ఎఫ్77 మోటారు సైకిల్లో మాదిరిగానే ఆల్ట్రా వయోలెట్ ఎఫ్77 మ్యాచ్ 2 మోటారు సైకిల్ డిజైన్ చేశారు. చార్జింగ్ పోర్ట్ క్యాప్ కోసం ప్లాస్టిక్ క్యాప్ బదులు అల్యూమినియం ఫ్లాప్ వాడారు. న్యూ బైక్ తొమ్మిది రంగుల్లో లభిస్తుంది. స్టెల్త్ గ్రే, ఆస్ట్రయిడ్ గ్రే, కాస్మిక్ బ్లాక్, ప్లాస్మా రెడ్, టర్బో రెడ్, ఆఫ్టర్ బర్నర్ ఎల్లో, స్టెల్లార్ వైట్, సూపర్ సోనిక్ సిల్వర్, లైటెనింగ్ బ్లూ రంగుల్లో ఈ బైక్ వస్తోంది. వీటితోపాటు న్యూ గ్రాఫిక్స్ కూడా జత చేశారు.
ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్2 (Ultraviolette F77 Mach 2) మోటార్ సైకిల్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేంతో డెవలప్ చేశారు. కంఫర్ట్ రైడింగ్ కోసం ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ 41ఎంఎం ఇన్వర్టెడ్ ఫోర్క్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. రైడింగ్ కోసం ఫ్రంట్‌లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ విత్ 110 సెక్షన్ టైర్స్, రేర్‌లో 150 సెక్షన్ టైర్స్, ఫ్రంట్ లో 320 ఎంఎం డిస్క్ బ్రేక్స్, రేర్ లో 230 ఎంఎం డిస్క్ బ్రేక్స్ విత్ డ్యుయల్ చానెల్ ఏబీఎస్ ఉంటాయి.
ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 మ్యాచ్2 (Ultraviolette F77 Mach 2) మోటారు సైకిల్ స్టాండర్డ్ వర్షన్లో 3-లెవెల్ రీజనరేషన్ బ్రేకింగ్, రెకాన్ వర్షన్లో 10-లెవెల్ రీ జనరేషన్ బ్రేకింగ్ వ్యవస్థలు ఉన్నాయి. గ్లైడ్, కంబాట్, బాలిస్టిక్ రైడింగ్ మోడ్స్ లో మోటారు సైకిల్ ఉంటది. స్టాండర్డ్ వర్షన్ మోటారు సైకిల్లో చార్జర్ లిమిట్, పార్క్ అసిస్ట్, ఫైండ్ మై ఎఫ్77, డీప్ స్లీప్, వేకేషన్ మోడ్ ఉంటాయి. ఆప్షనల్‌గా వయోలెట్ ఏఐ జియో ఫెన్సింగ్ డెల్టా వాచ్, లాక్ డౌన్, క్రాష్ అలర్ట్, డైలీ రేడ్ అనలిటిక్స్ వంటి ఫీచర్లు జత చేస్తారు.